Simhachalam Temple: సింహాచలం దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు... ఐఎస్ఓ సర్టిఫికెట్ ను ఈవోకు అందించిన మంత్రి అవంతి
సింహాచలం దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆలయానికి చెందిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐఎస్ఓ సర్టిఫికెట్ అందించింది.
విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సింహాచలం దేవస్థానానికి ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ) సర్టిఫికెట్ లభించింది. ఆలయానికి చెందిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐఎస్ఓ గుర్తింపునిచ్చింది. ఈ సర్టిఫికెట్ ను మంత్రి అవంతి శ్రీనివాస్ దేవస్థానం ఈవో సూర్యకళకు అందజేశారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగుల నాణ్యమైన సేవలు, పరిశుభ్రత, పచ్చదనంలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ గుర్తింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. భక్తులకు నాణ్యమైన సేవలందిచడంతోపాటు హిందు ధర్మాన్ని, సంస్కృతిని సింహాచలం దేవస్థానం కాపాడుతోందని సర్టిఫికెట్ లో తెలిపారు.
మరో సర్టిఫికెట్ వచ్చే అవకాశం
ఐఎస్ఓ గుర్తింపుపై సింహాచలం ఈవో సూర్యకళ స్పందించారు. ఈ సర్టిఫికేట్ ను మంత్రి అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ఆర్నెళ్ల నుంచి దేవస్థానంలో నాణ్యమైన సేవల గురించి ఆడిటర్ ద్వారా అంతర్జాతీయ సంస్థకు సమాచారం పంపించామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆహార, భద్రత విషయంలో ఆడిటింగ్ జరుగుతోందని ఆమె తెలిపారు. ఆ విభాగంలోనూ ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉందన్నారు.
Got international recognition. Today Simhachalam Sri Varaha Nrusimhaswamy temple has got ISO certificate for its standards in service and promoting culture and Hindu Dharma #international #award pic.twitter.com/wJSNX0s9Zk
— Simhadri Swamy (@simhadri_swamy) September 12, 2021
ప్రసాద్ పథకం ద్వారా రూ.54 కోట్లు మంజూరు
దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం సంతోషంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చేలా కృషి చేసిన దేవస్థానం ఈవో, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ సర్టిఫికేట్ ను నిర్వహణ నైపుణ్యత బట్టి ఇస్తారని పేర్కొన్నారు. ఈవో, ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేసి గుర్తింపు సాధించారని కితాబు ఇచ్చారు. దేవస్థానంలో భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం ద్వారా రూ.54 కోట్లు దేవాలయానికి మంజూరయ్యాయని మంత్రి అన్నారు. వసతి సౌకర్యం, క్యూలైన్ లో వచ్చే భక్తులకు మంచినీరు అందించడంతో పాటు ఇతర సౌకర్యాలు అభివృద్ధి చేయడంపై దృష్టిపెడతామని మంత్రి తెలిపారు. భక్తులకు అన్నదానం సౌకర్యాన్ని కూడా కల్పిస్తే బావుంటుందన్న మంత్రి ఈవో ఈ విషయంపై దృష్టిపెట్టాలని కోరారు.
Also Read: AP News: రైతు సమస్యలపై టీడీపీ నిరసనలు.. రేపటి నుంచి ‘రైతు కోసం తెలుగుదేశం’