Weather Updates : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Weather Updates : బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల విస్తరణ, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather Updates : నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్నాయి. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో వారంలో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి కూడా నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జూన్ 5 నుంచి జూన్ 10లోపు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి.
ఆంధ్రప్రదేశ్ లో
రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అనుకూల వాతావరణం కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది నైరుతి దిశగా వంగి ఉంది. మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఉత్తర దక్షిణ ద్రోణి మరఠ్వాడా కర్ణాటక మీదగా సముద్రమట్టాలనికి 1.5కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దీని ఫలితంగా ఏపీలో రాగల రెండు రోజుల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 19, 2022
తెలంగాణలో
తెలంగాణలో ఈ నెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం పలు జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళఖాతంలోని పలు ప్రాంతాలకు, మొత్తం అండమాన్ నికోబార్ దీవులకు, అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణశాఖ తెలిపింది.