శిశు విక్రయాలు, అక్రమ దత్తత స్వీకరించిన వారిపై కఠిన చర్యలు: ఏపీ బాలల హక్కుల కమిషన్
Child Selling in Telangana: శిశువులను విక్రయించినా, అనధికారికంగా దత్తత తీసుకున్నా వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ బాలల హక్కుల కమిషన్ హెచ్చరించింది. ఇలాంటి పనులు చేయవద్దని కేసలి అప్పారావు హెచ్చరించారు.
Child illegal adoptions in Andhra Pradesh | మంగళగిరి: శిశువులు, చిన్నారులను విక్రయిస్తున్న ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకోవడం తెలిసిందే. ఆర్ఎంపీ డాక్టర్ సహా ముగ్గుర్ని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. మొత్తం 50 మంది వరకు శిశువుల్ని విక్రయించినట్లు తేలగా, మరో 16 మంది శిశువులను గుర్తించి హైద్రాబాద్ లో శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచారు. కొందరు శిశువుల్ని కన్నతల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లారు. దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో శిశువులు, చిన్నారుల్ని ఎవరైనా విక్రయించినా, అనధికారికంగా దత్తత స్వీకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏపీ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు శుక్రవారం (మే 31న) ఆదేశాలు జారీ చేశారు.
అక్రమంగా శిశువుల విక్రయం
రోజుల వయసు నుంచి ఏడాది వయసులోపు శిశువుల్ని కొందరు పలు ప్రాంతాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి.. సంతానం లేని వారికి విక్రయిస్తున్నారు. హాస్పిటల్స్, ఇళ్ల నుంచి, ఎక్కడ వీలైతే అక్కడ నుంచి కొన్ని ముఠాలు శివువుల్ని కిడ్నాప్ చేస్తున్నాయి. ప్లాన్ ప్రకారం ఆ శిశువుల్ని సంతానం లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని నమ్మించి అమ్ముతున్నారు. కొన్నినెలల నుంచి జరుగుతున్న వ్యవహారంపై పోలీసులు ఫోకస్ చేశారు. ఓ అంతరాష్ట్ర ముఠాపై స్ట్రింగ్ ఆపరేషన్ చేసి నిందితుల్ని పట్టుకున్నారు. 16 మంది శిశువులను హైద్రాబాద్ లో శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించారు. ఆపై తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించి తమ కన్నబిడ్డల్ని తీసుకెళ్తుంటే.. పెంచిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఏపీలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేసలి అప్పారావు కోరారు.
ప్రముఖ మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన ఆయన.. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి, ఆ చిన్నారుల వివరాలు సేకరించాలన్నారు. బాలల అక్రమ రవాణా రాకెట్ నడుపుతున్న వారిని గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, పోలీసులకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలు జారీచేసింది.
ప్రస్తుతం రూట్ మార్చిన గ్యాంగ్‌లు
గతంలో సంతానం లేని దంపతులను నేరుగా కలిసి శిశువుల్ని విక్రయించేవారు. ఇప్పుడు ఈ గ్యాంగ్స్ పిల్లల కోసం చూస్తున్న వారిని టెక్నాలజీ సహాయంతో చిన్నారుల విషయంపై సంప్రదిస్తున్నారు. బాలల అక్రమ రవాణాను టెక్నాలజీ వాడి చేస్తున్నారని ఇటీవల ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. బైక్ అంటే బాబు అని, స్కూటీ అంటే పాప అని ప్రత్యేక కోడ్‌లు తయారు చేసుకుని మరీ శిశువుల విక్రయాలు జరిగినట్లు హైదరాబాద్‌లో ఇటీవల గుర్తించారు.
రాష్టంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిల్లో , ఫెర్టిలిటీ కేంద్రాలపై నిఘా పెంచాలని రాష్ట్ర అధికారులను బాలల హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయిలో అంగన్వాడి, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ కేసలి అప్పారావు సూచించారు. శిశువుల విక్రయాలు, శిశువుల అనధికారిక దత్తతపై ఎలాంటి సమాచారం అందినా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. విషయాన్ని సుమోటోగా తీసుకొని నిందితులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.