Andhra Smart meters Issue: ప్రజలు అంగీకరిస్తేనే విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Minister Gottipati Ravikumar: ప్రజలు అంగీకరిస్తేనే స్మార్ట్ మీటర్లు బిగించాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. కమర్షియల్, పరిశ్రమలకు మాత్రం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

Andhra Pradesh Smart meters only if people accept : ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధఇకారులను ఆదేశించారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఉండవన్నారు. పారిశ్రామిక, వ్యాపార అవసరాలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు ఉంటాయన్నారు. విశాఖలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో *ప్రజల అంగీకారం* లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ శాఖ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలకు సంబంధించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లను ముందుగా విద్యుత్ శాఖ అధికారులు, రాజకీయ నాయకుల ఇళ్లకు బిగించి వాళ్లను రోల్ మోడల్ గా చూపించిన తరువాత ప్రజలను స్మార్ట్ మీటర్ల వినియోగానికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు ఆమోదం లేని ఏ విషయం మీద అయినా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లదని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
స్మార్ట్ మీటర్ల వినియోగానికి సంబంధించి కొందరు సోషల్ మీడియాలో లేనిపోని అపోహలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. అధికారులు, రాజకీయ నేతల ఇళ్లకు బిగించిన తరువాత ప్రజలకు అవగాహన కలిగించి వారు కూడా స్మార్ట్ మీటర్లు వినియోగించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. పారిశ్రామిక, వ్యాపార వర్గాలు, సంబంధిత అవసరాలకు మాత్రమే ప్రస్తుతం స్మార్ట్ మీటర్లను వినియోగించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. వ్యవసాయ మోటార్లకు ఎటువంటి స్మార్ట్ మీటర్లు బిగించేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలపై ఎటువంటి భారం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయం సరఫరా చేయాలనే లక్ష్యంతో తాము పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోనూ సూర్యఘర్ ద్వారా 10,000 సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందించాలన్న లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరాతో పాటు అంతరాయాలు, అవరోధాలు గురించి మంత్రి గొట్టిపాటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలని ఈపీడీసీఎల్ సీఎండీ పృధ్వీతేజను ఆదేశించారు. ఆర్డీఎస్ఎస్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు స్థానిక కాంట్రాక్టర్ల సాయం తీసుకోవాలని సూచించారు. ఆర్డీఎస్ఎస్ పనులు మొదటి దశ పూర్తయితేనే., రెండో దశ నిధులు కోరేందుకు అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిమాండ్ కు తగినట్లు విద్యుత్ సరఫరా ఉందని ఈ సందర్భంగా మంత్రికి అధికారులు తెలిపారు. ఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాల్లోనూ వ్యవసాయానికి 9 గంటల నిరంతరాయ విద్యుత్ ను అందిస్తున్నట్లు అధికారులు మంత్రి గొట్టిపాటికి వివరించారు.





















