విద్యుత్తు ఛార్జీలు పెరిగిన మాట వాస్తవమే, విపక్షాలపై మంత్రి ధర్మాన మండిపాటు
నిత్యం ఏదో ఒక కామెంట్లతో వార్తల్లో నిలుస్తారు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. తాజాగా విద్యుత్తు ఛార్జీలు పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు.
Andhra Pradesh Minister Dharmana On Power Charges : నిత్యం ఏదో ఒక కామెంట్లతో వార్తల్లో నిలుస్తారు ఏపీ మంత్రి (Andhra Pradesh Minister) ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasad Rao). తన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలనే కాదు ప్రభుత్వాన్నిఇరుకున పెడుతుంటారు. తాజాగా విద్యుత్తు ఛార్జీలు (Power Charges ) పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలతో పక్కనున్న నేతలు షాకయ్యారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో పవర్ చార్జీలు పెరిగాయన్నారు. ధరల పెరుగుదల కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో ఆయనీ కామెంట్స్ చేశారు. గతంలో 14 ఏళ్ల పాటు చంద్రబాబు పాలనలో ప్రగతి కనిపించలేదని తెలిపారు. ప్రజలకు మంచి పథకాలు, ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం రోడ్లు బాగా లేవంటూ గుంతలు చూపిస్తున్నాయని మండిపడ్డారు. ఏడాది సమయం ఇస్తే రోడ్లు వేస్తామన్న ఆయన, స్థూల జాతీయోత్పత్తిలో రాష్ట్రం నాలుగేళ్లలో ప్రగతి సాధించిందని అన్నారు.
సామాజిక సాధికార యాత్ర సభతో స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు. పాతపట్నం లోపలికి వైసీపీ జెండా ఉన్న వాహనాలనే అనుమతించడంతో పోలీసులపై స్థానికులు మండిపడ్డారు. ప్రారంభ ఉపన్యాసంతోనే ప్రజలు వెనుదిరగడం ప్రారంభించారు. ముందుగా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు, శాసనసభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడారు. సభాపతి సీతారాం మాట్లాడుతుండగా ఓ వ్యక్తి తన సమస్య చెప్పుకోవాలని పలుమార్లు అరవడంతో అతన్ని పక్కకు తీయండి అంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు.
గతంలోనూ సొంత పార్టీని ఇరకాటంలోకి నెట్టి...
వైసీపీని స్థాపించి ఏళ్లు పూర్తయినా ప్రజలకు పార్టీ తెలియదా ? రెండు అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు ఎదుర్కొంది వైసీపీ. అయితే ఉత్తరాంధ్రలోని పలు ప్రాతాల్లో వైసీపీ గుర్తు ఇప్పటికీ తెలియదట. చాలా మంది వైసీపీ గుర్తు అంటే సైకిల్ అంటున్నారరి మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. వైసీపీ గుర్తుపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని, లేకపోతే దెబ్బ అయ్యే పరిస్థితి వస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తామని ఓటర్లు చెబుతున్నారని, అయితే గుర్తు మాత్రం సైకిల్‌కి వేస్తామని అంటున్నారని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను మళ్లీ గెలిపిస్తారా ? అని వీధుల్లో ప్రజలను ప్రశ్నిస్తే గెలిస్తామని చెబుతున్నారని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఓటు మాత్రం సైకిల్ గుర్తుకే వేస్తామంటున్నారని, ఇదే జరిగితే పార్టీకి పెద్ద దెబ్బేనని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తామని చెబుతూనే, గుర్తు మాత్రం సైకిల్ అని అంటున్నారని గుర్తు చేశారు. వైసీపీ గుర్తుపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడా ఏమిటో ప్రజలు గ్రహించారన్న ధర్మాన, జగన్ పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు.