SC Sub-Classification: ఎస్సీ వర్గీకరణ అమలుకు సవరణ నోటిఫికేషన్ జారీ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
SC Reservations in Andhra Pradesh | ఏపీలో ఎస్సీ ఉపకులా వర్గీకరణ నోటిఫికేషన్ ప్రభుత్వం శనివారం నాడు విడుదల చేసింది. మూడు కేటగిరీలుగా ఎస్సీ ఉపకులాలు వర్గీకరిస్తూ రిజర్వేషన్ ను షేర్ చేసింది.

Key decisions taken in AP Cabinet meeting | అమరావతి: ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల అమలుకు సాధారణ పరిపాలన శాఖ (GAD) శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా విద్య, ఉద్యోగ నియామకాలు, ఇతర అంశాల్లో ఎస్సీల వర్గీకరణ రిజర్వేషన్ అమలు కానుంది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా 3 గ్రూపుల్లోను మహిళలకు 33 (1/3) శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. ఇటీవల తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేస్తూ వారిని 3 కేటగిరీలుగా విభజించడం తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం సైతం ఇదే బాటలో నడుస్తోంది. గతంలో ఏపీలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ ఉండగా, దాన్ని 3 భాగాలుగా విభజించినట్లు జీఏడీ పేర్కొంది. షెడ్యూల్డ్ కులాల(ఉప వర్గీకరణ) నిబంధనలు పేరిట మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
ఎస్సీల్లోని గ్రూపు-1 కేటగిరి కింద రెల్లి ఉపకులాలకు 1 శాతం, గ్రూపు-2 కేటగిరీలోని మాదిగ, ఉపకులాలకు 6.5 శాతం, గ్రూపు-3 కేటగిరీలోని మాల ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ వర్తించనున్నట్లు నోటిఫికేషన్‌లో సాధారణ పరిపాలన శాఖ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, అన్ని శాఖలు, స్థానిక సంస్థలు ఎస్సీ వర్గీకరణ నోటిఫికేషన్‌లో చేసిన ఈ సవరణలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఇకనుంచి నియామక నిబంధనలను తాజా నోటిఫికేషన్‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని సూచించింది. పేర్కొంది.
గ్రూప్-1లోని 12 రెల్లి ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్
ఎస్సీ గ్రూప్ 1లోని రెల్లి ఉపకులాలు ఇవే.. మెహతార్(సీరియల్ నెంబర్ 48), పాకీ, మోతి, తోటి(51), పమిడి(53), రెల్లి(55), సప్రు(58), డోమ్, దొంబర, పైడి, పనో(20), ఘాసి, హడ్డి, రెల్లి చచండి(22), గొడగలి, గొడగుల(23), బావురి(8), చచటి(12), చండాల(16), దండసి(18)
గ్రూప్-2లో 18 మాదిగ ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్
గ్రూపు 2 ఎస్సీ ఉపకులాలు ఇవే.. గోదారి(సీరియల్ నెంబర్ 24), గోసంగి(25), జగ్గలి(28), జంబువులు(29), కొలుపులవాండ్లు, పంబాడ, పంబండ, పంబాల(30), అరుంధతీయ(5), బైండ్ల(10), చమర్, మోచి, ముచి, చమర్- రవిదాస్, చమర్- రోహిదాస్(14), చంభర్(15), డక్కల్, డొక్కల్వార్(17), ధోర్(19), సమగర(56), సింధోల్లు, చిందోల్లు(59), మాదిగ(32), మాదిగ దాసు, మష్తీన్(33), మాంగ్(43), మాంగ్ గరోడి(44), మాతంగి(47) ఉపకులాలు ఉన్నాయి.
గ్రూప్-3లో 29 మాల ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్
గ్రూపు 3 ఎస్సీ ఉపకులాలు ఇవే.. ఆది ఆంధ్ర(సీరియల్ నెంబర్ 1) ఎల్లమలవార్, ఎల్లమ్మలవాండ్లు(21), హోలెయా(26), హోలెయ దాసరి(27), ఆది ద్రవిడ(2), అనాముక్(3), అరే మాల(4), అర్వమాల(6), బరికి(7), బయగార, బయగారి(11), చలవాడి(13), యాతల(60), వల్లువన్(61), మాదాసి కురువ, మదారి కురువ(31), మహర్(34), మాల, మాల అయ్యవారు(35), మాల దాసరి(36), మాల దాసు(37), మాలహన్నాయి(38), మాల జంగం(39), మాల మస్తీ(40), మాలాసేల్, నెట్కాని(41), మాల సన్యాసి(42), మన్నె(45), మస్తీ(46), మిత అయ్యాళ్వార్(49), ముండాల(50), పంచమ, పరియా(54), సంబన్(57) ఉపకులాలు ఉన్నాయి.
ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఆమోదం
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌పై ఏప్రిల్ 15వ తేదీన జరిగిన ఏపీ మంత్రి మండలిలో చర్చించి ఆమోదం తెలిపారు. జాతీయ ఎస్సీ కమిషన్ (SC Commission) నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై ఏపీ కేబినెట్ భేటీలో కీలక చర్చ జరిగింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్‌కు కూటమి ప్రభుత్వం ఇదివరకే నివేదించింది. జాతీయ ఎస్సీ కమిషన్ పరిశీలించిన తర్వాత తిరిగి ఏపీ ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ నివేదిక పంపింది.






















