ఏ నెల పింఛను ఆ నెలలోనే.. 2 నెలలది ఒకేసారి ఇవ్వడం కుదరదు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం..
రెండు, మూడు నెలలు తీసుకోకున్నా ఆ మొత్తం కలిపి ఒకేసారి పింఛను ఇచ్చే విధానానికి ఏపీ ప్రభుత్వం స్వస్తి పలికింది. 2 నెలల పింఛను ఒకేసారి ఇవ్వడం కుదరదని.. ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలని స్పష్టం చేసింది.
వైఎస్సార్ పింఛను కానుక విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు మార్పులు తీసుకొచ్చింది. రెండు, మూడు నెలలు తీసుకోకున్నా ఆ మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. రెండు నెలల పింఛను ఒకేసారి ఇవ్వడం కుదరదని.. ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలని స్పష్టం చేసింది. వైఎస్సార్ పింఛను కానుక పథకానికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను లబ్ధిదారులకు తెలియజేయాలని.. వాలంటీర్లకు ఆదేశాలిచ్చింది. ప్రతి నెలా మొదటి మూడు రోజుల్లోనే లబ్ధిదారులు పెన్షన్ తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ఏ నెల అయినా సమయానికి ఫించన్ తీసుకోని పక్షంలో ఆ నెల డబ్బు చేతికందదని తెలిపింది. ఈ కొత్త నిబంధనలను బుధవారం (నేటి) నుంచే అమలు చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు.
ఆగస్టు, జూలై పింఛన్ రానట్టేనా?
సెప్టెంబర్ 1 (ఈరోజు) నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. నేడు సెప్టెంబర్ నెల నెల పింఛనే ఇస్తారు. దీంతో ఆగస్టు, జూలై నెలల్లో పింఛను తీసుకోని వారి డబ్బు మురిగిపోనుంది. దీని ప్రభావం దాదాపు లక్ష మందిపై పడనున్నట్లు అంచనా. ఎలాంటి ముందస్తు ఆదేశాలు లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఇతర రాష్ట్రాల్లో ఉండే లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2 లక్షల మంది ఉండే అవకాశం..
ఏపీలో ప్రతినెలా దాదాపు 60 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ డబ్బులు అందిస్తోంది. వీరిలో 2 లక్షల మందికి పైగా నెలనెలా పింఛన్లు తీసుకోవడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఏప్రిల్‌లో 2.04 లక్షల మంది, మే నెలలో 2.57 లక్షలు.. జూన్ నెలలో 2.70 లక్షలు.. జూలైలో 2.14 లక్షలు.. ఆగస్టులో 2.40 లక్షల మంది పింఛను తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. వీరంతా పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉండే వారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరంతా రెండు, మూడు నెలలకోసారి వచ్చి ఆ మొత్తాన్ని (రూ.6750 లేదా అంతకంటే ఎక్కువ) తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అక్రమాలకు చెక్..
ఇతర రాష్ట్రాల్లో ఉంటూ.. రెండు, మూడు నెలల పింఛన్లను ఒకేసారి తీసుకుంటున్నారని.. ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. వీటిని చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో నివాసం ఉంటున్న అర్హులైన పింఛనుదారులకు ఈ నిర్ణయంవల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. వాలంటీర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను లబ్ధిదారులకు తెలియజేస్తున్నారని.. ఇప్పుడు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా వారికి ఇప్పటికే తెలియజేసినట్లు పేర్కొన్నారు.