Chandrababu Bail in Skill development Case: చంద్రబాబుకు బెయిల్ మంజూరు - హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Chandrababu Bail: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాసిక్యూషన్ వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.
![Chandrababu Bail in Skill development Case: చంద్రబాబుకు బెయిల్ మంజూరు - హైకోర్టు కీలక వ్యాఖ్యలు andhra news ap high court key comments on while granting regular bail to chandrababu in skill development case latest news Chandrababu Bail in Skill development Case: చంద్రబాబుకు బెయిల్ మంజూరు - హైకోర్టు కీలక వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/20/0a8d341d3ce0c9aab9f8e2f5a96be3dc1700480221742876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP High Court Key Comments on Chandrababu Regular Bail: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు (Chandrababu) ఏపీ హైకోర్టు (AP High Court) రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ మధ్యంతర బెయిల్ పై ఉన్న ఆయనకు ఇప్పుడు పూర్తి స్థాయి బెయిల్ ఇస్తూ జస్టిస్ టి.మల్లికార్జునరావు తీర్పు వెలువరించారు. అయితే, తీర్పు సందర్భంగా ఉన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. 'నిధులు విడుదల చేసినంత మాత్రాన నేరంలో ఆయన పాత్ర ఉందని చెప్పలేం. చంద్రబాబు, టీడీపీ ఖాతాకు నిధులు మళ్లింపుపై కూడా ఎలాంటి ఆధారాలు లేవు. ఉల్లంఘనలపైనా అధికారులు సీఎంకు చెప్పినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారు. కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేశారు. విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదు. ఆయన జడ్ ప్లస్ కేటగిరీలో ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్నారు. కేసు విచారణ నుంచి ఆయన తప్పించుకునే అవకాశమే లేదు. కేసు విచారణకు చంద్రబాబు విఘాతం కలిగించే అవకాశం లేదు. సీమెన్స్ డైరెక్టర్, డిజైన్‌టెక్ యజమాని వాట్సప్ సందేశాలకు, చంద్రబాబుకు సంబంధం ఏంటి? చంద్రబాబు లాయర్ల వాదనలతో అంగీకరిస్తున్నాం' అని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో నిధులు దారి మళ్లాయన్న సీఐడీ వాదనలపై ఏపీ హైకోర్టు స్పందిస్తూ, దుర్వినియోగమైన నిధులు టీడీపీ ఖాతాలకు మళ్లాయన్న దానిపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు సమర్పించలేదని చెప్పింది. అలాగే, బోస్, డిజైన్ టెక్ యజమాని మధ్య వాట్సాప్ సందేశాలకు, ఈ కేసులో పేర్కొన్న లావాదేవీలకు సంబంధం ఉన్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. '2 లక్షల మందికి పైగా శిక్షణ తీసుకొని, ధ్రువపత్రాలు పొందారనేది నిర్వివాదాంశం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.370 కోట్లలో రూ.241 కోట్ల నిధులను సీమెన్స్, డిజైన్‌టెక్ షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ వాదిస్తోంది. నిధుల మళ్లింపు నిజమనుకుంటే 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సాధ్యపడుతుందా.? అని పిటిషనర్ ప్రశ్నిస్తున్నారు.' అని కోర్టు వ్యాఖ్యానించింది. శిక్షణ కేంద్రాలు, క్లస్టర్లలో మౌలిక సదుపాయాలు లేవని ప్రాసిక్యూషన్ సైతం చెప్పడం లేదని గుర్తు చేసింది.
వాదనలు సాగాయిలా
చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 15, 16 తేదీల్లో హైకోర్టులో ఇరువైపులా వాదనలు సాగాయి. రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలి తప్ప రాజకీయ నేతలకు కాదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
సీఐడీ ఏం చెప్పిందంటే.?
సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని… చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారని, మధ్యంతర బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించారని పేర్కొన్నారు. 'స్కిల్ స్కామ్ కేసులో రూ.10 నోట్లు వాడి హవాలా రూపంలో రూ.కోట్ల నగదు హైదరాబాద్ తరలించారు. బోస్ అనే వ్యక్తి ఫోన్ మెస్సేజ్‌ల ద్వారా ఈ విషయం బయటపడింది. సీమెన్స్ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారని వారు చెప్పారు. చీఫ్ సెక్రటరీ తన లెటర్‌లో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాశారు. ఈ క్రమంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చెయ్యొద్దు.' అని పొన్నవోలు కోర్టుకు తెలిపారు. లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్‌కవర్లో వైద్య నివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవని, బెయిల్ మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదని వివరించారు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలని విన్నవించారు. ఈ కేసులో ఇతర నిందితులకు బెయిల్ మంజూరైందన్న కారణంతో పిటిషనర్‌కు బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదు. అందువల్ల బెయిల్ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం చంద్రబాబు తరఫు లాయర్ల వాదనతో ఏకీభవిస్తూ ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.
Also Read: Chandra Babu Bail: చంద్రబాబుకు భారీ ఊరట - స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)