Chandra Babu Bail: చంద్రబాబుకు భారీ ఊరట - స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్
Chandrababu: స్కిల్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఆయన మధ్యంతర బెయిల్ పై ఉన్న ఆయనకు పూర్తి బెయిల్ లభించింది.
Chandrababu got Regular Bail in Skill Scam Case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) మాజీ సీఎం, టీడీపీ అదినేత చంద్రబాబుకు (Chandrababu) భారీ ఊరట లభించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్డు (Highcourt) తీర్పు ఇచ్చింది. అనారోగ్య కారణాలతో ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై ఉన్న ఆయనకు పూర్తి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జున్ రావు తీర్పు వెలువరించారు. ఈ నెల 28న చంద్రబాబు రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని, 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభలు, ప్రెస్ మీట్లలో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని సూచించారు. సెప్టెంబర్ 9న స్కిల్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా పలుమార్లు బెయిల్ పై విచారణలు వాయిదా పడ్డాయి. అనంతరం, అనారోగ్య కారణాల రీత్యా ఆయనకు చికిత్స కోసం అక్టోబర్ 31న 4 వారాల మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం చంద్రబాబు షరతులతో కూడిన బెయిల్ పై బయట ఉండగా పూర్తి బెయిల్ మంజూరైంది.
ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే.?
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ సెప్టెంబర్ 9న ఆయన్ను అరెస్ట్ చేసింది. అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.
- సెప్టెంబర్ 22 వరకూ రిమాండులో ఉన్న చంద్రబాబును, 2 రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించారు. అనంతరం సెప్టెంబర్ 24న మరోసారి బాబుకు రిమాండ్ విధించిన కోర్టు అక్టోబర్ 5 వరకూ దాన్ని కొనసాగించింది.
- అనంతరం విచారణ అనంతరం అక్టోబర్ 19 వరకూ చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ ను ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది.
- అనంతరం అనారోగ్య కారణాల దృష్యా అక్టోబర్ 31న చంద్రబాబుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుమారు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, నవంబర్ 24న సాయంత్రం చంద్రబాబు సరెండర్ కావాలని ఆదేశించింది. ఆయనకు అందించిన వైద్యం వివరాలను నివేదికలో సమర్పించాలని ఆదేశించింది.
స్కిల్ కేసులో సీఐడీ ప్రధాన ఆరోపణలివే
2014 – 19లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు కలిపి మొత్తం 40 చోట్ల ‘స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకోసం రూ.3,611.05 కోట్లతో సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలి. ఈ మేరకు 2017 జూన్ 30న జీవో 4ను టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. కానీ జీవో 4కు విరుద్ధంగా ఒప్పందం చేసుకునేలా ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు చక్రం తిప్పారని సీఐడీ ఆరోపించింది. రూ.100 స్టాంప్ పేపర్‌పై ఒప్పందం చేసుకున్నారు. అందులో తేదీ కూడా వేయలేదని సీఐడీ చెప్పింది. రూ.3,611.05 కోట్ల విలువ మేరకు కాంట్రాక్టును ఎలా నిర్ధారించారన్నదీ కూడా లేదని సీఐడీ చెబుతోంది. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు సమకూర్చాల్సిన 90 శాతం నిధులను ఏ విధంగా లెక్కించారన్నదీ చెప్పనే లేదు. సంబంధిత మొత్తం వేయాల్సిన చోట ఖాళీగా వదిలేశారని సీఐడీ ఆరోపించింది. జీవో ప్రకారం 90 శాతం నిధులు వెచ్చించాలన్న విషయాన్ని సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు పట్టించుకోలేదు. అయినా సరే ప్రభుత్వం మాత్రం తన వాటాగా చెల్లించాల్సిన 10 శాతం నిధులను జీఎస్టీతో సహా మొత్తం రూ.371 కోట్లు చెల్లించేసింది. అసలు పనులు చేయకుండానే నిధులు ఎలా చెల్లిస్తారని అప్పటి ఆడిట్ అకౌంటెంట్ జనరల్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించు కోలేదని సీఐడీ ఆరోపించింది.
బెయిల్ ఆర్డర్ లో న్యాయమూర్తి పేర్కొన్న అంశాలు:-
• పేరా 14:-
బెయిల్ దరఖాస్తు పరిశీలన దశలో పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ...ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయో లేదో నిర్థారించుకోవడానికి కనీస పరిశీలన అవసరం.
• పేరా 20:-
రూ.370 కోట్లు నగదు రూపంలో తీసుకుని అవినీతికి పాల్పడ్డారన్న అరోపణకు సిఐడి ఎలాంటి సాక్ష్యాలు చూపించలేకపోయింది.
• పేరా 21
అవినీతి జరిగిందని చెపుతున్న డబ్బును తెలుగు దేశం పార్టీ ఖాతాలకు మళ్లించారు అనేందుకు ఎటువంటి రుజువులూ లేవు.
• పేరా 22
పార్టీ ఖాతాల్లోకి డబ్బు మళ్లించారన్న తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు...వాటి ఆధారంగా రిమాండ్ కోరినప్పుడు దర్యాప్తు సంస్థ సిఐడి వాటికి సాక్ష్యాధారాలు చూపించి ఉండవలసింది. తద్వారా కోర్టు రిమాండ్ ను తప్పు పట్టింది. ఏ రకమైన ఆధారాలు లేకపోవడం సిఐడి దర్యాప్తు లోపంగా కోర్టు వ్యాఖ్యానించింది.
• పేరా 30
సిమెన్స్ సంస్థ తన పని సరిగా చేయలేదని సిఐడి వాదించలేదు. ఇదే కేసులో ఎ4 కు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో హైకోర్టు చెప్పిన తీర్పును ఉటంకించింది. పథకంలో 2.13 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందిన విషయాన్ని ప్రస్తావించింది.
• పేరా 31
పలువురు నిందితుల మధ్య వాట్స్ యాప్ సందేశాలు నడిచినట్లు దర్యాప్తు సంస్థ చెపుతోంది కానీ...అందులో ఈ కేసులో నేరాన్ని ఎక్కడా చూపించలేకపోయింది. ఈ చాట్ ఆధారంగా నగదు ఎక్కడి నుంచి వచ్చింది...లావాదేవీలు ఎందుకు జరిగాయి అనేది సిఐడి స్వయంగా అంగీకరించిన విషయాన్ని కోర్టు రికార్డు చేసింది.
• పేరా 32, 33
శరత్ అండ్ అసోసియేట్స్ సమర్పించిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుపై సిఐడి విపరీతంగా ఆధార పడింది కానీ...ఆ నివేదికే సవాలక్ష షరతులతో వచ్చిందని వాటిపై ఆధారపడి ఒక నిర్ణయానికి రాలేమని కోర్టు పేర్కొంది. ఒప్పందాల్లో తేడాలు ఉంటే దానికి సిఎం ఎలా బాధ్యులు అవుతారు అని కోర్టు ప్రశ్నించింది.
• పేరా 39
సీమెన్స్ ను ఈ సేవలకు ఉపయోగించుకోవాలని వారికి డబ్బులు విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయంలో ఐఎఎస్ అధికారి శ్రీమతి సునీత కూడా భాగస్వామి అన్న విషయాన్ని కోర్టు నమోదు చేసింది.
• పేరా 40
సునీత తప్పు చేసినట్లు కానీ...ఆమెపై చర్యలు తీసుకున్నట్లు కానీ సిఐడి ఎక్కడా చెప్పలేదు.
• పేరా 41
ముఖ్యమంత్రికి విశేష అధికారాలు లేవని కూడా సిఐడి వాదించలేదు. నిధులు విడుదల చేయాలి అని ఆదేశించినంత మాత్రాన ఆధారాలు లేకుండా ఆ నిధులు పార్టీ ఖాతాకు మళ్లించారనడం సరికాదని పేర్కొంది
సబ్ కాంట్రాక్టర్ల తప్పిదాలు చేసి ఉంటే దానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యడు అవుతారన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది.
కార్యక్రమంలో తప్పులేమైనా జరిగినట్లు అధికారులు...నాటి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు లేవని కోర్టు పేర్కొంది.
• పేరా 44
అక్రమాలు జరిగినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు తేల్చినట్లు పేర్కొన్న సిఐడి...దానికి అవసరం అయిన ఆధారాలు మాత్రం చూపలేదు.
• పేరా 45
బెయిలుపై బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు అనే సిఐడి వాదనను కోర్టు కొట్టేసింది.
• పేరా 48
కేసు దాఖలు అయ్యాక ఏడాది పది నెలల్లో అప్పటి సిఎం కేసును ప్రభావితం చేశారిని సిఐడి కూడా ఎక్కడా చెప్పలేదు.
• పేరా 49
మితిమీరి షరతులు విధిస్తే....ఎన్నికల్లో పిటిషనర్ కు చెందిన రాజకీయ పార్టీపై , కార్యకలాపాలపై ప్రభావం పడుతుందన్నారు.