Visakha harbor Accident: 'ప్రమాద స్థలానికి సీఎం జగన్ రావాల్సిందే' - విశాఖ హార్బర్ వద్ద మత్స్యకారుల నిరసన, ఉద్రిక్తత
Visakha Fishing Harbor: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హార్బర్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
![Visakha harbor Accident: 'ప్రమాద స్థలానికి సీఎం జగన్ రావాల్సిందే' - విశాఖ హార్బర్ వద్ద మత్స్యకారుల నిరసన, ఉద్రిక్తత visakhapatnam news fishermen protest in visakha fishing harbor in vizag latest news Visakha harbor Accident: 'ప్రమాద స్థలానికి సీఎం జగన్ రావాల్సిందే' - విశాఖ హార్బర్ వద్ద మత్స్యకారుల నిరసన, ఉద్రిక్తత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/20/42c219043cfe16da19daa05863bda4941700464101461876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Fishermen Protest in Visakha Fishing harbor: విశాఖ ఫిషింగ్ హార్బర్ (Visakha Fishing harbor) ప్రమాదంపై మత్స్యకారులు (Fishermen) తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రమాదంలో జీవనాధారమైన తమ బోట్లు కాలిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్కో బోటు ఖరీదు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఉంటుందని రూ.కోట్లల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదాలు చూడలేదని చెప్పారు. ఈ క్రమంలో ఫిషింగ్ హార్బర్ గేట్ వద్ద నిరసన చేపట్టారు. ప్రమాద ఘటనా స్థలాన్ని సీఎం జగన్ (CM Jagan) సందర్శించి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మత్స్యకారులకు సద్ది చెప్పారు. మరోవైపు, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాలని మంత్రి సీదిరి అప్పలరాజును ఆదేశించారు.
ఇదీ జరిగింది
విశాఖలో ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 60 బోట్లు దగ్ధం కాగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అప్రమత్తం అయినప్పటికీ ఆస్తి నష్టాన్ని తగ్గించలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 4 ఫైరింజన్లు, ఓ ఫైర్ టగ్ నౌకతో మంటలు అదుపులోకి తెచ్చారు. బోట్లలో ఉండే ఇంధనంతో మంటలు మరింత వ్యాపించాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, కారణాలు అన్వేషించాలని నిర్దేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, వారికి తగు సహాయం చేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించారు. మత్స్యకారులు ఆయనకు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రమాదానికి అదే కారణమా.?
కాగా, అగ్ని ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాత్రి ఫిషింగ్ హార్బర్ లో ఓ యూట్యూబర్ మద్యం పార్టీ ఏర్పాటు చేసి, మద్యం మత్తులో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బోటుకు నిప్పు పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న సదరు యూట్యూబర్, అతని స్నేహితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. వారిని పట్టుకుని విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రమాద స్థలంలో సీసీ కెమెరాల ద్వారా మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని జేసీ, అధికారులు పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టమని, ఆస్తి నష్టంపై పూర్తి స్థాయి అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
Also Read: Vizag Fishing Harbor : వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదం - 60కి పైగా బోట్లు దగ్దం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)