Anantapur News : ఎంపీ మాధవ్‌కు లేని శిక్ష నాకెందుకు? అధికారులను నిలదీసిన ఏఆర్ కానిస్టేబుల్
Anantapur News : సేవ్ ఏపీ పోలీస్ అనే ప్లకార్డు పట్టుకున్న కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు ఉన్నతాధికారులు. ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన పనికి ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు కానీ తనను ఉద్యోగం నుంచి తొలగించారని అతడు ఆవేదన చెందుతున్నారు.
Anantapur News : అనంతపురం జిల్లాలో సేవ్ ఏపీ పోలీస్ అంటూ ఓ ప్లకార్డు పట్టుకొని నిలబడిన కానిస్టేబుల్ గుర్తున్నారా. ఇప్పుడు ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పాత కేసులను తిరగేసిన తనపై చర్యలు తీసుకోవడాన్ని కానిస్టేబుల్ ప్రకాశ్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ అనంతపురంలో పర్యటించిన సందర్భంగా ఏఆర్‌కానిస్టేబుల్ ప్రకాశ్ ప్లకార్డు పట్టుకొని నిలబడ్డారు. సేవ్ ఏపీ పోలీస్ అంటూ నినదించారు కానిస్టేబుల్ ప్రకాష్. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకుంది. అతడిపై ఉన్న పాత కేసులను తిరగదోడి కానిస్టేబుల్ ను డిస్మిస్ చేశారు అధికారులు.
కేసు పెట్టి మహిళతో మీడియా ముందుకు
406, 420, 506 సెక్షన్ల కింద కానిస్టేబుల్ ప్రకాశ్‌పై కేసు నమోదైనట్టు అనంతపురం జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఆయనపై ఉన్న ఆరోపణలు నిజమని తేలడంతో డిస్మిషల్ ఫ్రం సర్వీస్ చేసినట్టు వివరించారు. తనను ఉద్యోగం నుంచి తీసివేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు కానిస్టేబుల్ ప్రకాశ్. అప్పట్లో తనపై కేసు పెట్టిన వ్యక్తితోనే మీడియా ముందుకు వచ్చారు. తనపై ఎలాంటి అత్యాచార ప్రయత్నం చేయలేదని సదరు మహిళ వివరించారు. కోర్టులో విచారణ సాగుతుండగానే ఇంతలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని తప్పుపట్టారు.
మా కుటుంబానికి ప్రాణహాని
అధికార పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన పనికి ఇంత వరకు చర్యలు తీసుకోలేదని, ఎలాంటి నేరనిర్ధారణ కాకుండా తనపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రకాశ్ ప్రశ్నిస్తున్నారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు ప్రకాశ్. తనకు గానీ తన కుటుంబానికి గానీ హాని జరిగితే మాత్రం జిల్లా ఎస్పీ ఫకీరప్పదే పూర్తి బాధ్యతన్నారు. దళితుడినైనా తనపై కక్షసాధింపులకు జిల్లా ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై చర్యలు తీసుకున్నట్టుగానే మిగిలిన ఉన్నతాధికాలుపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిస్మిస్ ఆర్డర్ వచ్చినప్పుడు నుంచి డిపార్ట్‌మెంట్‌లో చాలా మంది ఫోన్‌లు చేసి పరామర్శించారని వివరించారు. ఎలాంటి తప్పు చేయని తనపై డిస్మిషల్ ఆర్డర్‌పై పునఃపరిశీలన చేయాలని సీఎం జగన్‌ను విజ్ఞప్తి చేశారు ప్రకాశ్.
కుట్రపూరితంగానే డిస్మిస్
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను కుట్రపూరితంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారని ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాశ్ ఆరోపిస్తున్నారు. పోలీసులకు రావాల్సిన బకాయిలపై ప్లకార్డులతో నిరసనలు తెలపడం తప్పా అని ప్రశ్నించారు. ఏ తప్పు చేశానని తనను ఉద్యోగం నుంచి తొలగించారో చెప్పాలని భాను ప్రకాశ్ అధికారులను నిలదీశారు. తనకు జరిగిన అన్యాయంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వెళ్లి ఫిర్యాదు చేస్తానన్నారు. ఎస్పీ ఫకీరప్పపై ఆరోపణలు లేవా? మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలను బెదిరించి రూ.లక్షలు వసూలు చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోకుండా, నిరసన తెలిపిన తనపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. పోలీసులకు రావాల్సిన బకాయిలపై ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. తన ఆందోళన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదన్నారు.
Also Read : యూట్యూబ్‌లో పాఠాలు, నెల్లూరులో ప్రయోగాలు- ఫేక్ ఈడీ గ్యాంగ్ ప్లానింగ్ తెలిస్తే మతిపోతుంది