వీడెవడండీ బాబు! వేరుశనక్కాయలు తిన్నంత ఈజీగా పాములు మింగేస్తున్నాడు
వేరుశనక్కాయలు తిన్నంత ఈజీగా పాములను తిన్న వ్యక్తిని చూశారా? ఇలాంటి వాళ్లు ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారంటే నమ్ముతారా?
పొరపాటున పాము కనిపిస్తేనే చాలా మంది కిలోమీటర్ దూరం పరుగెత్తుతారు. టీవీలో కనిపిస్తేనే భయపడి కళ్లుమూసుకుంటారు. అలాంటిది పాములనే తినే వ్యక్తి ఉన్నాడంటే... బతికున్న పాములనే కరకర నమిలి మింగేస్తాడంటే నమ్ముతాం. కానీ అలాంటి వ్యక్తి ఉన్నాడు. ఎక్కడో కాదు. అనంతపురం జిల్లా కనిపిస్తున్నాడీ అరుదైన వ్యక్తి.
చైనా లాంటి దేశాల్లో పాములను, కప్పలను లొట్టలేసుకొని తినేస్తారు. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే శాల్తీ మాత్రం బతికున్న పామునే చీల్చుకొని అమాంతం మింగేస్తాడు. ఏదో వేరుసెనక్కాయలు వొలుచుకుని తిన్నట్టు లటుక్కున నోట్లో వేసుకుంటున్నాడు.
పామును దగ్గర నుంచి చూశామంటే మనకు ఒళ్లు జలదరిస్తుంది.. ఆయనకు మాత్రం నోరు లబలబమంటుంది. పాములంటే ఎంత ఇష్టమంటే పచ్చి పామునే ఉప్పూ కారం పెట్టకుండా లాగించేసేంత ఇష్టమనమాట.
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామానికి చెందిన పెద్ద పుల్లన్న అనే వృద్ధుడికి పాములంటే చాలా ఇష్టం. ఎంత అంటే చచ్చిన పాము కనపడితే ఎంతో కమ్మగా ఆరగించేంత..! చాలా కాలంగా పాములు తినే అలవాటున్న పెద్ద పుల్లన్న ఆదివారం రోజు ఊర్లో చచ్చిపడిన పామును ఆరగిస్తుండటంతో కొందరు యువకులు ఆ ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అది కాస్తా వైరలైంది.
బతికున్న పామును చీల్చి తినేస్తున్న పుల్లన్నను చూసిన నెటిజన్లు వీడెవడండీ బాబూ అనుకుంటూ కామెంట్లు పెట్టారు. అయితే పెద్ద పుల్లన్న పాములను మాత్రం చంపడు.. ఎవరైనా చంపి పడేస్తే దాన్ని ఇష్టంగా ఆరగిస్తాడంతే..!
ఇలా పాములను తినే బ్యాచ్ గతంలో కూడా కనిపించారు. కరోనా సమయంలో తమిళనాడు రాష్ట్రంలో పాములు తింటూ ఓ వ్యక్తి వైరల్ అయ్యాడు. కరోనా సెకండ్ వేవ్ పీక్‌లో ఉన్న సమయంలో పామును తింటే ఎవరో కరోనా రాదని చెప్పడంతో.. మధురై జిల్లా పెరుమపట్టికి చెందిన వడివేలు అనే ఓ వ్యవసాయ కూలి మద్యం మత్తులో పామును తినేశాడు. అప్పట్లో అదో పెద్ద హాట్‌టాపిక్ అయింది.
పుల్లన్న సంగతి తెలిసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. పాములను ఇలా తినడం ప్రమాదకరమని పులన్న సన్నిహితులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సాహసాలు చేయొద్దని సలహా ఇస్తున్నారు. అయినా పుల్లన్న వెనక్కి తగ్గడం లేదు. తాను ఇప్పటి వరకు పాములు ఎప్పుడు చంపలేదని.. ఎవరైనా చంపేసిన పాములనే తింటున్నట్టు పుల్లన్న చెబుతున్నాడు.