AP Fake Votes: ఏపీలో ఓటర్లు పెరగలేదు - నకిలీ ఓట్లపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
Fake Votes in Andhra Pradesh: రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఓటర్ల పెరుగుదల నమోదు కాలేదు, ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేశారు.
Fake Votes in Andhra Pradesh:
సచివాలయం, వెలగపూడి: ఆంధ్రప్రదేశ్ లో నకిలీ ఓట్ల అంశంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదివరకే టీడీపీ శ్రేణులు రాష్ట్రంలో నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేయగా ఈసీ సైతం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటోంది. తాజాగా వైసీపీ సైతం నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఓటర్ల పెరుగుదల నమోదు కాలేదు, ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సచివాలయంలోఆంధ్రప్రదేశ్ ఛీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను కలసి వినతిపత్రం అందించారు. రాష్ర్టంలో 2014 నుండి 2019వరకు, 2019 నుండి 2023 వరకు రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య హెచ్చు తగ్గులకు సంబంధించి ఫిర్యాదులో పేర్కొన్నారు.
2014 నుంచి 2019 వరకూ 30,08,032 ఓట్లు ఉండగా.. ఓటర్ల జాబితాలో పెరిగాయన్నారు. అదే 2019 నుంచి 2023 కాలంలో 38 వేల ఓట్లు మాత్రమే తగ్గాయని ఫిర్యాదులో వివరించారు. అదే విధంగా ఓటర్ల వృధ్ది చూసినట్లయితే 2014-19 మధ్య కాలంలో 8.1 శాతం మేర వృద్ధి నమోదైందని 2019 నుంచి 2023 మధ్య 0.09 శాతం క్షీణత నమోదైందని పేర్ని నాని తెలిపారు.
సీఈసీకి వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులో ఇంకా ఏముందంటే...... గతేడాది కంటే 2023 సంవత్సరంలో నికర ఓట్ల సంఖ్య తగ్గింది. దీనిని బట్టి నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోంది. 2019 ఓటర్ల జాబితా నుండి నకిలీ ఓట్లను తొలగించే అంశాన్ని పరిశీలించాలి. నకిలీ ఓట్ల విషయంపై సమగ్ర విచారణ జరపాలని ఎన్నికల కమిషన్ ను అధికార పార్టీ కోరుతోంది.
2014లో మొత్తం ఓటర్లు 3,68,26,744 (3 కోట్ల 68 లక్షల 26 వేల 7 వందల 44) కాగా 2019లో మొత్తం ఓటర్లు 3,98,34,776 (3 కోట్ల 98 లక్షల 34 వేల 7 వందల 76)
2014కు 2019కి మధ్య ఓట్ల తేడా 30,08,032 (పెరుగుదల 30 లక్షల 8 వేల 32)
2019లో మొత్తం ఓటర్లు 3,98,34,776, 2023లో మొత్తం ఓటర్లు 3,97,96,678
2019కి 2023కి మధ్య ఓట్ల తేడా 38,098 (తగ్గుదల 38 వేల 98) ఉందని తెలియచేశారు.