Andhra Pradesh Politics: చంద్రబాబు వేధింపులు భరించలేక ఐపీఎస్‌లు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు- జగన్
YS Jagan Press Meet | ఇటీవల గుడివాడలో కృష్ణా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఆమె భర్త మీద దాడి చేపించిన చంద్రబాబు దానవీరశూరకర్ణ కంటే బాగా నటించారు, ఎన్టీఆర్ కన్నా గొప్ప నటుడు అని జగన్ అన్నారు.

YS Jagan Satires on AP CM Chandrababu | తాడేపల్లి: ఎన్టీఆర్ కంటే గొప్ప నటుడు చంద్రబాబు అని.. దానవీరశూరకర్ణ కన్నా గొప్పగా ఏపీ సీఎం నటించారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మీరు దాడి చేసి జడ్పీ చైర్ పర్సన్ హారికను మహానటి అని మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. హారిక భర్త రాము తన కారుతో ఢీకొట్టాడని తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారు. డ్రైవర్ గవర్నమెంట్ ఉద్యోగి, వెనక సీట్లో కూర్చున్న వ్యక్తిపై ఏ విధంగా కేసు పెట్టారో అర్థం కావడం లేదు. ఈ దాడి ఘటనలో పోలీసులు ఎంత మందిని అరెస్ట్ చేశారు. ప్లాన్ చేసి దాడులు చేస్తున్నా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తన పర్యటన ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారని చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు.
తాడేపల్లిలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో ప్రజలు తలెత్తుకుని పనిచేసేవారు. స్పందన అనే కార్యక్రమంలో వైసీపీ వాళ్ల కన్నా టీడీపీ వాళ్ల సమస్యలే ఎక్కువగా పరిష్కారం చేశాం. ఎవరికి సమస్య వచ్చినా చంద్రబాబు మాట వినని పోలీసులు అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే.. డీజీ స్థాయి అధికారి అయిన పీఎస్ఆర్ ఆంజనేయులును, మరో అడిషనల్ డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్, సంజయ్ అనే అధికారి, బీసీ అధికారి క్రాంతి రానా టాటా, డీఐజీ స్థాయి విశాల్ గున్నీలపై అక్రమ కేసులు బనాయించారు. విచారణ పేరుతో ఎంతో మంది ఎస్పీలను వేధించారు. 22 మంది అడిషనల్ ఎస్పీలు, 50 మంది డీఎస్పీలకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరికొందరు పోలీసు ఉన్నతాధికారులను హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయాలన్నారు. ఎంతో మంది అధికారులు వీఆర్ లో ఉన్నారు.
వేధింపులు తట్టుకోలేక అధికారులు రాజీనామా
’తన మోచేతి నీళ్లు తాగే అధికారులను మాత్రమే పోత్సహిస్తూ వారిని అవినీతిలో భాగస్వామ్యం చేస్తున్నారు. వీరు ఆయన ఆర్మీగా మారి బెల్ట్ షాపులు, నియోజకవర్గంలో పరిశ్రమలు, పేకాడ క్లబ్బుల విషయంలో డీఐజీల ఆధ్వర్యంలో సీఐలు కలెక్ట్ చేసి ఎమ్మెల్యేలకు మనీ ఇస్తున్నారు. పైకి చినబాబు, పెద్దబాబుకు వెళ్తుంది. సిద్ధార్థ కౌశల్ లాంటి యంగ్ ఐపీఎస్ అధికారి వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. నేరాలు చేసేవాళ్లకు బదులు, పోలీసులు రాష్ట్రాన్ని వదిలి వెళ్తున్న దుస్థితి ఏపీలో ఉంది.‘
ఇన్నేళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ప్రతిపక్షం పాత్ర ఏంటో కూడా తెలియదా. ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత మాపై ఉంది. గుడివాడలో కృష్ణా జిల్లా చైర్ పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ సైకోలు, చంద్రబాబు శాడిస్ట్ గ్యాంగ్ దాడి చేసింది. బీసీ మహిళ అయిన హారిక చేసిన తప్పేంది. ఆమెను నోటికొచ్చిన మాటలు ఎందుకన్నారు. చంద్రబాబు మోసాలను, హామీల అమలుపై ప్రశ్నిస్తే వైసీపీ మహిళా నేతకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది. కారు అద్దాలు పగలగొడుతుంటే గంటలపాటు ఆమె తన భర్తతో పాటు భయంభయంగా వాహనంలోనే కూర్చున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇది జరుగుతున్నా వారు ప్రేక్షకపాత్ర పోషించారు.
రైతులను పరామర్శించినా కేసులే..
మిర్చి ధరలు పడిపోయాయని ఫిబ్రవరిలో గుంటూరు మిర్చియార్డుకు వెళ్లాను. గతంలో మా ప్రభుత్వంలో మిర్చి క్వింటాలు ధర రూ.21 నుంచి 27 వేలు. ఇప్పుడు మిర్చి ధర 8 నుంచి 10 వేలకు పడిపోయింది. రైతులకు అండగా మిర్చి యార్డుకు వెళ్లడం తప్పా. పోలీసులు సహకరించవద్దు అని నాకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను తొలగించారు. చంద్రబాబు ఆదేశాలతో మాకు సహకరించకపోగా, రైతులకు సంఘీభావం తెలిపినందుకు తిరిగి మాపైనే కేసులు పెట్టారు.
సంఘీభావం తెలిపినా నాపై అక్రమ కేసులు
సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో స్థానిక ఎమ్మెల్యే చేతిలో వైసీపీ నేత కురుమ లింగయ్య హత్యకు గురైతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే.. భద్రత కరువైంది. హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. రామగిరిలో పర్యటన తరువాత వైసీపీ ఇంచార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టారు. పార్టీకి చెందిన వారికి సమస్య వస్తే పరామర్శించడం కూడా తప్పేనా.. పొగాకు ధరలు పడిపోవడంతో పొదిలికి వెళ్తే వేధించారు. 160కి పడిపోయింది. అసలు కొనేనాథుడు లేదు. గతంలో 180 పైచిలుకు ఉండే ధర రూ.80 కి పడిపోయింది. ఎక్కడ పరామర్శకు వెళ్లినా, రైతులకు సంఘీభావం తెలిపినా అక్రమ కేసులు పెడుతున్నారు.






















