Handri Neeva Latest News:హంద్రీనీవా ఫేజ్-1 కాలువల పనులు పూర్తి- రేపు నీరు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
Handri Neeva Lift Irrigation Project Latest News:హంద్రీనీవా ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు పూర్తి అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నీటిని విడుదల చేయనున్నారు.

Handri Neeva Lift Irrigation Project Latest News:సీమ ప్రజల నీటి నిరీక్ష ముగిసింది. ఎప్పుడెప్పుడూ ఆని కొన్ని ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సీమ ప్రజల దాహార్తి తీరబోతోంది. హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో రేపు(గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేయనున్నారు.
హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 17న నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద నీటిని విడుదల చేస్తారు. ముందు ప్రకటించినట్టుగానే వంద రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. రూ.696 కోట్లతో చేపట్టిన పనులతో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్ధ్యం 3850 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్కుల మేర నీటిని తరలించే అవకాశం దక్కింది. జీడిపల్లి రిజర్వాయర్‌ను నింపితే కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు దాహార్తి తీరనుంది.
మల్యాల నుంచి జీడిపల్లి వరకూ 216 కిలోమీటర్లకుపైగా హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తి అయ్యాయి. జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజులదిన్నె సహా స్థానికంగా రాయలసీమ జిల్లాల్లోని చెరువులు జలకళను సంతరించోనున్నాయి. ఫలితంగా సీమ జిల్లాల్లో భూగర్భజలాలు పెరిగేందుకు ఆస్కారం ఉంది.

12 ఏళ్ల తర్వాత మళ్లీ 40 టీఎంసీలు
హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ పూర్తి సామర్ధ్యం 2,200 క్యూసెక్కులు మాత్రమే ఉండేది. దీంతో ఒకట్రెండు సార్లు మాత్రమే 40 టీఎంసీలు వినియోగించుకునే వీలు కలిగింది. ఇప్పుడు ఆ కాలువల సామర్ధ్యం 3,850 క్యూసెక్కులకు పెంచారు. దీంతో 40 టీఎంసీల వరద జలాలను పుష్కలంగా వాడుకోవచ్చు. నెలకు దాదాపు 4.27 టీఎంసీల చొప్పున 4 నెలల వరద కాలంలో అదనంగా 17.10 టీఎంసీలg తీసుకునేందుకు అవకాశం దక్కింది.

హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీలు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల అవసరాలు తీర్చనున్నాయి. ఫేజ్ 1 ద్వారా నంద్యాల జిల్లాలో 2906 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. రెండో దశ పూర్తి అయితే అనంతపురం జిల్లాలో 2.27 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాలకు నీరు అందనుంది.
ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది?
రాయలసీమకు కృష్ణా జలాలు తరలించాలన్న సంకల్పంతో 1989లో ఎన్టీఆర్ ఈ హంద్రీనీవా ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లాలోని హంద్రీ, చిత్తూరు జిల్లాలోని నీవా నదులు అనసంధానించి మాల్యాల వద్ద హంద్రీనీవా పేరుతో ఎత్తిపోతల పథకానికి పునాది రాయి వేశారు. అప్పుడు మొదలైన ప్రాజెక్టు మొదటి దశ పనులు 2006లో ప్రారంభమయ్యాయి. తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొద్ది కొద్దిగా పనులు చేస్తూ ఇప్పటికి మొదటి ఫేజ్ పనులు పూర్తి అయ్యాయి. రెండో దశ పనుల్ని కూడా జులై నెలాఖరుకు పూర్తి చేసి పుంగనూరు, కుప్పంలోని చివరి ఆయకట్టుకూ నీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీని కోసం రూ.3,890 కోట్లు ఖర్చు చేస్తోంది.
ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్లు, బ్రాంచ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు ఉన్నందున మొదటి దశలో దాదాపు పది చోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. దీనికి భారీగా విద్యుత్ ఖర్చు అవుతుంది. అందుకే అక్కడ సోలార్ ప్లాంట్ పెట్టాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది.





















