Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు, నారా లోకేష్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు
Nara Lokesh Comments: పార్టీలో సీనియర్లను పక్కనపెట్టి, దాదాపు 40 శాతం వరకు యువతకు టికెట్లు ఇచ్చి బరిలోకి దించాలన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిర్ణయాన్ని సీనియర్ నేతలు ప్రశంసిస్తున్నారు.
Nara Lokesh Comments as No ticket to three time losers: తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. ముఖ్యంగా యువతకు టీడీపీ నుంచి పిలుపొచ్చింది. పార్టీలో సీనియర్లను పక్కనపెట్టి, దాదాపు 40 శాతం వరకు యువతకు టికెట్లు ఇచ్చి అసెంబ్లీ బరిలోకి దించాలన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్ణయాన్ని సీనియర్ నేతలు సైతం ప్రశంసిస్తున్నారు. మరోవైపు వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు సైతం టీడీపీ టికెట్ ఇచ్చేది లేదని సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్. పార్టీలో పదవులు రెండు సార్లు దక్కుతాయని, యువతకు అవకాశం ఇస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని లోకేష్ మహానాడులో స్పష్టం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు యాక్టివ్ గా లేరని, అలాంటి నేతలకు ఇంఛార్జి పదవులు ఉండవని, ఒకవేళ అధికారం లోకి వచ్చినా మంత్రులు పార్టీకి తమ ప్రొగ్రెస్ రిపోర్ట్ చేసేలా చర్యలు తీసుకుంటామన్న వ్యాఖ్యలను ఏపీ మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథ్ రెడ్డి, నిమ్మకాలయ చిన రాజప్ప సమర్థించారు.
లోకేష్ నిర్ణయాన్ని స్వాగతిస్తాం
పార్టిలో యువ రక్తం తీసుకురావలన్న నారా లోకేష్ నిర్ణయాన్ని స్వగతిస్తున్నామని పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజల్లోకి పార్టిని తీసుకువెళ్ళటంతో పాటుగా రాబోయే రోజుల్లో అధికారంలోకి రావటమే టార్గెట్ గా పని చేయాలని నిర్ణయించామని విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఈ మేరకు మహానాడులో పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఇక పై పోరాటమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతామని చెప్పారు.
ఇక నుంచి పోరాటాలే: పల్లె రఘునాథ్ రెడ్డి
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ వైఫల్యాలే కీలకంగా ప్రజల్లోకి వెళతామని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్పారు. ఇక రాబోయేది అంతా పోరాటాల కాలమేనని అన్నారు. ప్రజలు, పార్టీని కీలకంగా భావించి నేతలు, క్యాడర్ కష్టపడి పని చేయాల్సిన సమయం ఆసన్నం అయిందని తెలిపారు. టీడీపీని మళ్లీ బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అందులో భాగంగానే 40శాతం యువతకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఇవ్వనున్నామని చెప్పారు.
అదే మా ముందున్న కర్తవ్యం: నిమ్మకాలయ చిన రాజప్ప
రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తీసుకురావటమే తమ ముందున్న కర్తవ్యం అని ఏపీ మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంతో పాటుగా అభ్యర్దుల ఎంపిక పై పూర్తి స్దాయిలో కసరత్తు జరుగుతుందని, యువతకు చంద్రబాబు పెద్దపీట వేయాలని మహానాడు సందర్భంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.