AP Budget Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ పోరుబాట, గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముందు ముందు ఎలా ఉంటాయో తొలిరోజే తేలిపోయింది. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఆందోళనచేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేడి అప్పుడే మొదలైంది. సమావేశమైన తొలిరోజే తెలుగు దేశం పార్టీ ఆందోళన బాట పట్టింది. గవర్నర్ ప్రసంగం జరుగుతున్నంత సేపు నినాదాలు చేస్తూనే ఉంది. ఆ పార్టీ సభ్యులు ప్రభుత్వానికి, గవర్నర్‌కు వ్యతిరేకంగహా స్లోగన్స్ చేశారు.
రాజ్యాంగ బద్దమైన సంస్థల తీర్పులను, దర్యాప్తులను ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా గవర్నర్ పట్టించుకోవడం లేదని టీడీపీ సభ్యులు విమర్శలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ ఎందుకంటూ గవర్నర్ గోబ్యాక్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోడియం చుట్టుముట్టి గవర్నర్ బిశ్వభూషన్ స్పందించాలంటూ గట్టిగా అరుస్తూ ప్రసంగానికి అడ్డు తగిలారు. ప్రసంగం కాగితాలను చించి గాల్లోకి విసిరారు.
తెలుగు దేశం పార్టీ సభ్యులు చేస్తున్న ఆందోళనపై అధికార పార్టీ వైసీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సభలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది.
గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభనుంచి టీడీపీ వాకౌట్ చేసిందు. గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ నేతలు ఆందోళన చేస్తారేమో అని అనుమానించిన మార్షల్స్ వారిని అటు నుంచి వెళ్లనీయలేదు. వేరే దారిలో వెళ్లాలని సూచించారు. మండలికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా అంటూ వాళ్లపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాట్లాడనివ్వడం లేదు.. లాబీల్లో కూడా ఉండనివ్వరా అంటూ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకు ముందు అసెంబ్లీ వచ్చే దారిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. మందడం చెక్‌పోస్టు వద్ద సభ్యులను పోలీసులు నిలువరించారు. దీంతో కాసేపు అక్కడ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై ప్రజా ప్రతినిధుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆందోళనలతో దిగొచ్చిన పోలీసులు... సభ్యులను సభలోకి అనుమతించారు.