రాజధాని నాశనానికే సెంటుపట్టాల పంపిణీ- జగన్‌పై బొండా ఉమ ఫైర్
రాజధానిలో పేదల నివాసం కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించామని... ఆ స్థలంలో కాకుండా మరోచోట సెంటు పట్టాలు ఇవ్వడం ముమ్మాటికీ పేదల్ని దగా చేయడమేని అన్నారు బొండా ఉమ.
పేదల ముసుగులో రాజధాని నాశనానికే జగన్ రెడ్డి సెంటుపట్టాల పంపిణీకి తెరలేపారని తెలుగు దేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఎలాంటి మౌలిక వసతులు లేని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలిస్తే వాటితో ఒరిగేదేంటని ఆయన ప్రశ్నించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలపై అధికారమదం, ఖాకీజులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ముఖ్యమంత్రి పేదలపై కపట ప్రేమచూపుతూ, రాజకీయకుట్రలకు బీజం వేస్తున్నారని అన్నారు.
పథకం ప్రకారం 4ఏళ్లలో ప్రజారాజధానిని నిర్వీర్యం చేసిన జగన్, కుట్ర రాజకీయాల్లో భాగంగానే పేదలకు పనికిరాని సెంటు పట్టాలిస్తున్నారని బొండా ఉమ వ్యాఖ్యానించారు. ప్రభుత్వమిచ్చే సెంటుపట్టాలు పేదలకు ఎందుకు ఉపయోగపడవని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.
డీఎస్పీని వదిలిపెట్టం...
రాజధాని నిర్మాణానికి ఎవర్ని అడిగి భూములిచ్చారంటూ మహిళల్ని ప్రశ్నించి అనుచితంగా ప్రవర్తించిన డీఎస్పీ పోతురాజుని వదిలిపెట్టమని బొండా ఉమ హెచ్చరించారు. ఎవర్ని అడిగి భూములిచ్చారని మహిళల్ని, రైతుల్ని అడగటానికి పోతురాజు ఎవరని ప్రశ్నించారు. పోతురాజు లాంటి పోలీసోళ్లను అడ్డంపెట్టుకొని పరదాలచాటున నక్కి భయంభయంగానే ముఖ్యమంత్రి ఇళ్లపట్టాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చే సెంటు పట్టాలు మాకొద్దు మేం రాం అంటున్నారని ఆరోపించారు. అలాంటి వారిని వైసీపీ నేతలు బెదిరించి, భయపెట్టి రాజధానికి తీసుకొచ్చేపనిలో నిమగ్నమయ్యారని, రాజధాని ప్రాంతంలో విధి నిర్వహణకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోవడానికి ముఖ్యమంత్రే కారణమని బోండా అన్నారు.
టీడీపీ హయాంలో ఇలా...
టీడీపీ ప్రభుత్వం పేదల నివాసానికి రాజధానిలో ప్రత్యేకంగా స్థలం కేటాయించిందని బోండా గుర్తు చేశారు. మొత్తం నిర్మాణాలకు కేటాయించిన భూమిలో 5శాతం భూమిని పేదలకు ఉచితంగా ఇస్తూ ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసిందని వివరించారు. నివాస స్థలాలు ఉండాల్సిన జోన్‌లో కాకుండా మరో ప్రాంతంలో జగన్ పేదలకు స్థలాలు ఇవ్వడం ముమ్మాటికీ వారిని మోసగించడమేనని చెప్పారు. జగన్ పేదలకు ఇస్తున్న సెంటు పట్టా భూముల్లో ఎలాంటి మౌలిక వసతులు లేవని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్ వంటిసౌకర్యాలు లేకుండా ప్రజలు ఎక్కడ, నివాసం ఉంటారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజధాని నిర్మాణాన్ని నవనగరాలుగా నిర్మించాలన్న ఆలోచనతో మాస్టర్ ప్లాన్ రూపొందించారని తెలిపారు బొండా ఉమ. పేదల నివాసం కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో కాకుండా, మరోచోట సెంటు పట్టాలు ఇవ్వడం ముమ్మాటికీ పేదల్ని దగా చేయడమేని అన్నారు. రోడ్లనిర్మాణం, విద్యుత్ సౌకర్యాం వంటివాటిని టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేసిందని, రాజధాని ప్రాంతంలోని పేదల కోసం 5వేల టిడ్కోఇళ్లు కూడా నిర్మించారని తెలిపారు.
రాష్ట్రంలో జగన్ రెడ్డి చెప్పిందే చట్టమా?
రాష్ట్రలో చట్టం, న్యాయం, రూల్ ఆఫ్ లా ఎక్కడా అమలు కావడం లేదని బొండా అన్నారు. కర్నూలు జిల్లాలో సీబీఐ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అవినాశ్ రెడ్డి ఆసుపత్రిలో దాక్కుంటే, రాష్ట్ర పోలీసు లు, గూండాలు, రౌడీలతో కలిసి అతనికి రక్షణగా నిలవడమేంటిని ప్రశ్నించారు. ఆసుప త్రిలోనే ఉన్న హంతకుడు అవినాశ్ రెడ్డికి కాపలాగా ఉండమని ఖాకీలకు ఏ చట్టం చెప్పిందని బోండా అన్నారు.