Shivraj Singh Chouhan AP Visit: ఈ 10న ఏపీకి రానున్న కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్.. పర్యటన పూర్తి షెడ్యూల్
Andhra Pradesh News | కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం రానున్న కేంద్ర మంత్రి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

అమరావతి: కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం (నవంబర్ 10) నాడు గుంటూరు జిల్లాకు రానున్నారు. మరుసటి రోజు వాటర్‌షెడ్ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు.
కేంద్ర మంత్రి చౌహాన్ నవంబర్ 10న రాత్రి 8:40 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో బయలుదేరి రాత్రి 9:45 గంటలకు గుంటూరులోని ఐటీసీ హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు.
వాటర్‌షెడ్ మహోత్సవ్ మహోత్సవం..
నవంబర్ 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు హోటల్ నుంచి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బయలుదేరి 9:45 గంటలకు గుంటూరు మండలం వెంగళాయపాలెం చేరుకుంటారు. అక్కడ 10:30 గంటల వరకు క్షేత్ర సందర్శన చేస్తారు. అనంతరం ఆయన నల్లపాడులోని లయోల పబ్లిక్ స్కూల్‌కు 11 గంటలకు చేరుకుని, అక్కడ 'వాటర్‌షెడ్ మహోత్సవ్' కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి భేటీ
మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడి నుంచి బయలుదేరి ఉండవల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి శివరాజ్ చౌహాన్ వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు నివాసం నుంచి తిరిగి బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు ఐటీసీ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ జరిగే వాటర్‌షెడ్ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
ఢిల్లీకి తిరుగు ప్రయాణం..
సాయంత్రం 6:45 గంటలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసానికి వెళ్లి భేటీ అవుతారు. రాత్రి 7:45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతారు. రాత్రి 8:25 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి ప్రయాణం అవుతారని మంత్రి కార్యాలయం తెలిపింది.






















