Sajjala on Chiranjeevi: అప్పట్లో జగన్‌ని మెచ్చుకొని ఇప్పుడెందుకు విమర్శలు - చిరంజీవిపై సజ్జల కీలక వ్యాఖ్యలు
గతంలో తాము ఓ నిర్ణయం తీసుకున్నామని, ఏ సినిమా అయినా రూ.100 కోట్ల బడ్జెట్ దాటితే, దాన్ని రుజువు చేసే పత్రాలు సమర్పించి టికెట్ ధరలు పెంచుకొనేలా దరఖాస్తు చేసుకోవచ్చని సజ్జల అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పందించారు. చిరంజీవి రాజకీయాలు మాట్లాడాలంటే నేరుగా మాట్లాడొచ్చని అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని గతంలో ఆయనే మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో కేంద్రమంత్రిగా చిరంజీవి ఉండేవారని, ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ తాజాగా బీజేపీతోనే ఉన్నారని అన్నారు. అలాంటప్పుడు నేరుగా బీజేపీ పెద్దల్ని కలిసి రాష్ట్రానికి కావాల్సినవి మంజూరు చేయవచ్చు కదా అని అన్నారు.
గతంలో తాము ఓ నిర్ణయం తీసుకున్నామని, ఏ సినిమా అయినా రూ.100 కోట్ల బడ్జెట్ దాటితే, దాన్ని రుజువు చేసే పత్రాలు సమర్పించి టికెట్ ధరలు పెంచుకొనేలా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి, నిర్మాతకు ఆదాయం వస్తుందని అన్నారు. ఇంత మంచి వ్యవస్థను ప్రవేశపెట్టిన సీఎం జగన్‌ను గతంలో చిరంజీవి కూడా అభినందించారని.. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారని సజ్జల రామక్రిష్ణారెడ్డి అన్నారు.
చంద్రబాబుపైన కూడా వ్యాఖ్యలు
పుంగనూరులో జరిగిన ఘటనపై కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పుంగనూరు ఘటనతో చంద్రబాబు పైశాచికానందం పొందారని.. అక్కడి నుంచే రాష్ట్రమంతా అల్లర్లకు ప్లాన్ చేశారని అన్నారు. పుంగనూరు ఘటనలో చంద్రబాబు ఆధారాలతో సహా దొరికారని అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండగా పవన్‌ను దగ్గరపెట్టుకొని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.
నాయకుడు గొడవలు ఆపడానికి ప్రయత్నిస్తారని, కానీ, చంద్రబాబు మాత్రం రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో ఉన్న పోలీసులే ఇప్పుడు కూడా ఉన్నారని అన్నారు. పోలీసులంటే చంద్రబాబుకు చులకనభావం ఏర్పడిందని, 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పోలీసులను కొట్టాలని చంద్రబాబే స్వయంగా చెప్పారని అన్నారు. ఇలాంటి కరడు కట్టిన వ్యక్తులను సినిమాల్లోనే చూసేవాళ్లమని.. ఇప్పుడు చంద్రబాబును చూస్తున్నామని అన్నారు.