YSRCP News: ఏప్రిల్ 7 నుంచి ‘జగనన్నే మా భవిష్యత్’, భారీ కార్యక్రమానికి శ్రీకారం - సజ్జల వెల్లడి
జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులను సమన్వయం చేసుకుంటూ భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేందుకు భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని చెప్పారు. లక్షలాది మంది కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వలంటీర్లు, గృహ సారథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని స్పష్టం చేశారు.
మొత్తం యంత్రాగం అంతా శాసన సభ్యులు, రీజినల్ కో ఆర్డినేటర్ల నేతృత్వంలో జరుగుతుందని చెప్పారు. ‘జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్’ అనేది జనంలోంచి వచ్చిన నినాదం అని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు రావడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. మేనిఫెస్టో అమలు దగ్గర్నుంచి లక్ష్యం చేరే వరకు పేదల కుటుంబాల్లో వెలుగు కోసమే సీఎం జగన్ ప్రయత్నం చేస్తుంటారని అన్నారు. గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం తో మార్పు కనిపిస్తోంది అనేది ప్రజల మాటల్లో అర్థం అయిందని చెప్పారు.