మొన్న తాడికొండ- నేడు పొన్నూరు- వైసీపీలో తలనొప్పిగా మారుతున్న వర్గపోరు
మొన్నటి వరకు తాడి కొండలో ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనలు చేశారు. వారిని శాంతింపజేయడానికి చాలా మంది రంగంలోకి దిగారు. ఇప్పుడు సీన్ పొన్నూరుకు షిప్టు అయింది.
గుంటూరులో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువయ్యింది. ఒక వర్గం మరో వర్గంపై దాడికి పాల్పడి ఆధిపత్యం కోసం హత్యాయత్నానికి వెనుకాడటం లేదు. ఇప్పుడిది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహరంపై సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగుతున్నారు.
గుంటూరు జిల్లాలోని పొన్నూరులో వైసీపీ శ్రేణుల ఆందోళనపై పార్టీలో చర్చ జరుగుతుంది. ఇటీవల పెదకాకాని మండలం పార్టీ అధ్యక్షుడు పూర్ణపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది, ఎమ్మెల్యే కిలారి రోశయ్య వర్గం అని ఆరోపిస్తున్నారు. పూర్ణ పార్టీలో రెండో వర్గంగా ఉంటున్న రావి వెంకటరమణ వర్గం కావటంతోనే దాడి జరిగిందని చెబుతున్నారు. దీంతొ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై పార్టీ వర్గాలు పట్టించుకోవాలని, దాడికి పాల్పడిన వారి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రావి వెంకటరమణ వర్గం డిమాండ్ చేస్తూ నిరసనకు పిలుపునిచ్చింది.
ఆది నుంచి వర్గపోరే....
పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు మొదటి నుంచి కామన్‌గానే కంటిన్యూ అవుతుంది.ఈ విషయం పార్టీలోని పెద్దలకు కూడా తెలుసు. పార్టీ ఏర్పాటు అయిన నాటి నుంచి రావి వెంకటేశ్వరరావు జగన్‌తో పాటే ఉంటూ పార్టీని నియోజకవర్గంలో ముందుకు నడిపించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో పీకే సర్వే ఆదారంగా జగన్ సీట్లను కేటాయించారు. ఇందులో రావి వెంకటరమణను పక్కన పెట్టి, అప్పటి కప్పుడు వచ్చిన కిలారి రోశయ్యకు జగన్ సీట్ కేటాయించారు. ఆ తరువాత ఎన్నికలు జరగటం పార్టీ తరపున నిలబడిన కిలారి రోశయ్య విజయం సాధించారు.
ఎన్నికల సమయంలోనే జగన్ రావి వెంకటరమణకు తగిన ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే రావి వర్గం మాత్రం అప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నప్పటికి అసంతృప్తిగానే ఉంటున్నారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే కిలారికి వ్యతిరేకంగా పని చేయటంపై ఆయన వర్గం కూడా అసంతృప్తిగా ఉంది. పార్టీ పదవుల్లో కిలారికి అడ్డుపడటంతోపాటుగా, నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వర్గాన్ని ప్రోత్సహించారని ప్రచారంలో ఉంది. దీంతో పార్టీ పెద్దలకు ఎమ్మెల్యే కిలారి వర్గం ఆధారాలతో సహ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అదిష్ఠానం కూడా రావికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటి నుంచి రావి వర్గంపై కూడా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా దాడులు ఆరంభం అయ్యాయయని అంటున్నారు.
మట్టి మాఫియా- కుల పోరు
నియోజకవర్గంలో మట్టి తరలింపు వ్యవహరం పై తీవ్ర స్దాయిలో ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహరంలో స్థానికంగా ఎమ్మెల్యే కిలారి రోశయ్యను టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర టార్గెట్‌గా చేసి విమర్శలు చేశారు. ఏకంగా మట్టి తరలించే ప్రాంతానికి వెళ్లి అక్కడ ట్రాక్టర్లను, జేసీబీలను అడ్డుకొని ఎమ్మెల్యే కిలారిపై ఆరోపణలు చేశారు. ఇక్కడ కూడ మరో కీలక అంశం తెర మీదకు వచ్చింది.
ధూళిపాళ్ళ నరేంద్ర మట్టి మాఫియా అంశం రావి వర్గం ద్వారానే తెర మీదకు తెచ్చి ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై అసత్య ప్రచారాలు చేశారంటూ, పార్టి పెద్దలకు కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ వ్యవహరంలో కిలారి వర్గందే పైచేయి అయ్యింది.
ఉమ్మారెడ్డి సపోర్ట్
పార్టీలో కీలక నేతగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడ కిలారి రోశయ్య...పార్టీలో ఉమ్మారెడ్డికి మంచి వెయిట్ ఉంది. జగన్ కూడా ఉమారెడ్డికి గౌరవం ఇస్తుంటారు. దీంతో ఇదే వెయిటేజ్‌తో కిలారి కూడా ఎన్నికల సమయంలో సీట్‌ను దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా అదే సపోర్ట్‌తో కిలారి కూడా పార్టీలో చక్రం తిప్పుతున్నారని ప్రచారం ఉంది.
12వ తేదీన రావి వర్గం ఆందోళన...
ఎమ్మెల్యే కిలారి వర్గానికి వ్యతిరేకంగా రావి వర్గం దాడికి గురయిన పూర్ణకు న్యాయం చేయాలంటూ పెద్దకాకాని సెంటర్‌లో ఆందోళనకు పిలుపునిచ్చారు. సొంత పార్టీ నేతలపైనే దాడి జరిగితే పట్టించుకోరా అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. నేడు పూర్ణపై దాడి జరిగింది.. రేపు ఎవరంటూ పోస్టర్ లో ప్రదర్శిస్తున్నారు.