AP Portfolios: ఏపీలో మంత్రులకు శాఖలు ఫిక్స్, పవన్‌కు గ్రామీణాభివృద్ధి - హోంశాఖ మంత్రిగా అనిత, మిగతా వారికి ఇవీ
AP Ministers List 2024: రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన మంత్రులకు శుక్రవారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ను నియమించడంతోపాటు కీలక శాఖలను అప్పగించారు.
AP Ministers 2024 : ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం పూర్తయింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో కొన్ని కీలక శాఖలను కూడా ఆయన వద్ద ఉంచుకున్నారు. లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ తోపాటు మంత్రులకు కేటాయించని కొన్ని శాఖలు చంద్రబాబు వద్ద ఉన్నాయి. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అందరూ ఊహించినట్టుగానే ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించారు.
అదే సమయంలో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కూడా పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. అలాగే చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటి, ఆర్టీజి శాఖలను కేటాయించారు. గతంలో నారా లోకేష్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. మరో సీనియర్ నేత కేంద్రాలకు కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ, కో - ఆపరేషన్, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్యకార శాఖలను కేటాయించారు. గతంలో అందరు గతంలో కార్మిక, ఉపాధి, కర్మాగారాలు, యువత మరియు క్రీడలు, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు ఆహారం పౌరుసరఫరాల శాఖను కేటాయించారు.
ఉమ్మడి రాష్ట్రంలో మనోహర్ స్పీకర్ గా పని చేశారు. కొల్లు రవీంద్ర కు మైండ్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్ శాఖను కేటాయించారు. గతంలో కొల్లు రవీంద్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. పొంగూరు నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలను కేటాయించారు. గతంలోనూ ఆయన ఇవే శాఖలకు మంత్రిగా పనిచేశారు. వంగలపూడి అనితకు హోమ్, విపత్తులో నిర్వహణ శాఖ బాధ్యతలను అప్పగించారు.
బిజెపి నుంచి తొలిసారి గెలిచిన సత్య కుమార్ యాదవ్ కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్యా శాఖల బాధ్యతలను అప్పగించారు. డాక్టర్ నిమ్మల రామానాయుడుకు నీటిపారుదల శాఖను కట్టబెట్టారు. మహ్మద్ ఫరూఖ్ కు న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖను ఇచ్చారు. ఆనం రామనారాయణరెడ్డికి దేవాదాయ శాఖను అప్పగించారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఈయన పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. పయ్యావుల కేశవ్ కు కీలకమైన ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ టాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ శాఖలను కట్టబెట్టగా, అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ బాధ్యతలను అప్పగించారు.
కొలుసు పార్థసారథికి హౌసింగ్, సమాచార శాఖ బాధ్యతలను అప్పగించారు. డోలా బాల వీరాంజనేయస్వామికి సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ల శాఖలను కేటాయించారు. గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సాంస్కృతిక, కల్చరల్ అండ్ సినిమాటోగ్రాఫీ శాఖను అప్పగించారు.
గుమ్మడి సంధ్యారాణికి స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖలును అప్పగించారు. బీసీ జనార్థన్ కు రహదారులు, భవనాల, మౌలిక వసతులు కల్పన, పెట్టుబడుల శాఖ బాధ్యతలను అప్పగించారు. టీజీ భరత్ కు పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలను కేటాయించారు. ఎస్ సవితకు బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖను కేటాయించారు. అలాగే వాసంశెట్టి సుభాష్ కు కార్మికులు, పరిశ్రమలు, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ శాఖలను కట్టబెట్టారు. కొండపల్లి శ్రీనివాస్ కు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సేర్ప్, ప్రవాస భారతీయుల అభివృద్ధి, సంబంధాలు శాఖ, మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువత, క్రీడల మంత్రిత్వ శాఖను అప్పగించారు. తాజాగా ఏర్పాటైన మంత్రివర్గంలో దాదాపు 80 శాతం మంది కొత్త వారే ఉండడం గమనార్హం.