Nara lokesh: ఆశావర్కర్ కృపమ్మ కుటుంబానికి నారా లోకేష్ రూ.2 లక్షల ఆర్థిక సహాయం
Asha worker krupamma: తాడేపల్లిలో మృతి చెందిన ఆశా కార్యకర్త రేపూడి కృపమ్మ కుటుంబానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాసటగా నిలిచారు.
అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో మృతి చెందిన ఆశా కార్యకర్త రేపూడి కృపమ్మ కుటుంబానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాసటగా నిలిచారు. ఆశా వర్కర్ కృపమ్మ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీ మంత్రి పీతల సుజాత, రాష్ట్ర మహిళ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి.. కృపమ్మ కుటుంబాన్ని పరామర్శించి లోకేష్ ఇచ్చిన 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
తాడేపల్లిలో ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో కృపమ్మ మృతి చెందడం తెలిసిందే. ఆశా వర్కర్ కృపమ్మ కుటుంబాన్ని ఏపీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీడీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. టీడీపీ, సీఐటీయూ రెండు రోజుల నిరసనతోనే ప్రభుత్వం దిగి వచ్చింది అన్నారు అనురాధ. ఆశావర్కర్లు దేవుళ్ళతో సమానం అన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయిన అధిక పని ఒత్తిడి కారణంగానే కృపమ్మ మృతి చెందారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు.
అరకొర జీతాలు ఇస్తూ ఆశా వర్కర్లకు నవరత్నాలు ఆపేశారని అనురాధ అన్నారు. సరైన ట్రైనింగ్ ఇవ్వకుండా ఆశావర్కర్లను ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఆరోగ్య సురక్ష పేరుతో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న బీపీ, షుగర్ మందులే ఇస్తున్నారని చెప్పారు. నారా లోకేష్ బాధలో ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్నారని ఎమ్మెల్సీ అనురాధ పేర్కొన్నారు.
ఆశా కార్యకర్త కుటుంబానికి నారా లోకేష్ ఇచ్చిన ఆర్థిక సహాయం అందించిన తరువాత టీడీపీ మహిళా నేతలు మాట్లాడుతూ.. ఆశా వర్కర్ కృపమ్మది జగన్ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఆశా కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. చనిపోయిన కృపమ్మ కుటుంబ సభ్యులకు వైసీపీ ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షలు ఇవ్వాలని మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం సైతం ఇవ్వాలన్నారు. సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి కనిపిస్తోందని, ప్రభుత్వ ఆస్పత్రులు గంజాయి విక్రయ కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ లేదని, అత్యాచారాలకు నిలయంగా రాష్ట్రం మారిందని వ్యాఖ్యానించారు.