కుప్పంలో కాల్పులు జరగాలని చంద్రబాబు కోరుకున్నారు- మంత్రి అంబటి తీవ్ర ఆరోపణలు
ఎక్కడ పర్యటిస్తే అక్కడ హింస జరిగి జనాల ప్రాణాలు పోతే చంద్రబాబు ఆనందిస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. కుప్పంలో కూడా జనాలను రెచ్చగొట్టి పోలీసులు కాల్పులు జరిపేలా ప్రేరేపించారన్నారు.
11మందిని చంపిన విషయాన్ని దారి మళ్ళించేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసమే తమ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను అమలులోకి తీసుకువచ్చిందన్నారు. చంద్రబాబు రక్తపు మరకల నుంచి పుట్టిందే ఆ జీవో అని వెల్లడించారు.
కుప్పంలో చట్టాన్ని ఉల్లంఘిస్తున్న బాబు, ఎన్ని రంకెలు వేసినా.. ఆ జీవోను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదన్నారు. కుప్పంలో బాబుకు ఇల్లు లేదు, ఓటు లేదని ఎద్దేవా చేశారు. కుప్పంలో మూడు రోజులుగా చంద్రబాబు పర్యటిస్తున్నారని జీవో నెం.1 ను అమలు చేయడానికి పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తుంటే దానికి విరుద్ధంగా ఆవేశపూరిత ఉపన్యాసాలు, రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ గురించి బాబు అవాకులు, చవాకులు మాట్లాడడం చూస్తుంటే పిచ్చెక్కిందేమో అనిపిస్తోందన్నారు. పిచ్చికుక్క ఎలా అరుస్తుందో అలా బాబు అరుస్తున్నారని, నా నియోజకవర్గంలో నన్ను తిరగనివ్వరా? నన్నాపడానికే ఈ జీవో విడుదల చేశారని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.
ఎవరికి నచ్చినట్టు ఇష్టమొచ్చిన చోట సభలు వద్దన్నదే జీవో సారాంశమని చెప్పారు అంబటి. రోడ్ల పైన, రోడ్డు మార్జిన్లలో సభలు, ర్యాలీలు వద్దని, నిర్ణీత ప్రదేశాల్లోనే నిర్వహించాలని జీవోలో ఉందన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టరాదన్నదే సారాంశమని తెలిపారు. బాబు విషయాన్ని దారి మళ్లిసున్నారని, కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోయి విషయాన్ని దాచి పెట్టేందుకు అవసరం లేకున్నా రాద్దాంతం చేస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు.
బాబు ఎక్కడికి వెళ్తే అక్కడ శని...
శనిలా రాష్ట్రానికి చంద్రబాబు దాపురించాడని, ప్రభుత్వానికి జనం ప్రాణాలు ముఖ్యం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వం తమదని, ప్రజలను రక్షించడానికి తెచ్చిన జీవో, బాబును కాని, వారాహిని కాని, యువగళం ఆపడానికి కాదని రాంబాబు చెప్పారు. గోదావరి పుష్కరాలకు భక్తులు 29 మంది చనిపోయారని, విజువల్స్‌లో బ్రహ్మాండంగా చూపించాలని డ్రోన్ షాట్ల కోసం.. జనం ప్రాణాలను బలిగొనడానికి చంద్రబాబు కారకుడయ్యారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎక్కడ సభ పెడితే అక్కడ పిట్టల్లా జనం రాలిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరులో తాము మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి వెళ్లినప్పుడు వారిని పోగొట్టుకున్న ఆ కుటుంబాలు తీవ్ర కలత చెందాయని అన్నారు. ప్రాణాలు పోతే చంద్రబాబు తిరిగివ్వగలనా అని అంబటి నిలదీశారు.
కుప్పంలో టీడీపీ సమాధి...
కుప్పంలో టీడీపీ సమాధి అయ్యిందనే చంద్రబాబు అవేదన అని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు గతంలో ఎన్నడూ తిరగనన్ని సార్లు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత, కుప్పంలో తిరిగారని , దీన్ని బట్టి చూస్తే కుప్పంలో ఓడిపోతామనే భయం చంద్రబాబకు పట్టుకుందని ఆయన అన్నారు. కుప్పంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాల్టీలు చంద్రబాబు గెలిచారా అని ప్రశ్నించారు. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ను కూడ తెచ్చుకోలేని అసమర్దుడు చంద్రబాబని వ్యాఖ్యానించారు. కుప్పానికి బ్రాంచ్ కెనాల్‌ను తీసుకువచ్చింది కూడా జగన్ హయాంలోనేనని గుర్తు చేశారు. కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదని,కనీసం ఓటు కూడ లేదన్నారు.
హింస జరిగితే బాబుకు ఆనందం...
23 సీట్లకు పరిమితమైన పార్టీకి ప్రజల తరపున మాట్లాడే అర్హత ఎక్కడ ఉందని చంద్రబాబును అంబటి ప్రశ్నించారు. 151 సీట్లు గెల్చుకుని ముఖ్యమంత్రి అయిన జగన్‌కి మాత్రమే అన్ని హక్కులు ఉన్నాయనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. కుప్పంలో హింసను ప్రేరేపించి, కాల్పులు జరిగి ఉండాల్సిందని చంద్రబాబు భావించారని, ప్రజలపై పోలీసులు తిరగబడాలి, ఎవరైనా చనిపోతే బాగుండు అనే కోరిక చంద్రబాబులో ఉందన్నారు.