(Source: ECI/ABP News/ABP Majha)
40 పెండింగ్ సమస్యలపై గళమెత్తిన ఏపీ ఉద్యోగ సంఘాలు- ప్రభుత్వానికి నెల రోజుల గడువు
ఉద్యోగుల సమస్యలపై ఆర్ధిక శాఖ అధికారులను ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు కలిశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఈ సాయంత్రం వారితో సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు మరోసారి సమస్యలపై గళమెత్తబోతున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో చాలా ఇంకా పరిష్కారం కాలేదంటూ ఆర్థికశాఖాధికారుల వద్ద ప్రస్తావించారు. తక్షణే స్పందించకుంటే మరోసారి కార్యచరణ రూపొందిస్తామని సుతిమెత్తగా హెచ్చరించారు.
సంవత్సరాల పాటు పెండింగ్‌లో ఉన్న 40 సమస్యలు సత్వరం పరిష్కరించాలని ఆర్ధిక శాఖ అధికారులను ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు కలిశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో స్పెషల్ ఛీప్ సెక్రెటరీ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణతో ఈ సాయంత్రం సమావేశమయ్యారు. గతంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఇంతవరకూ అమలుకాలేదని వారికి వివరించారు. సెప్టెంబర్ 30లోగా సీపీఎస్‌పై నిర్నయం తీసుకుంటామని గతంలో చెప్పారని గుర్తు చేశాయి ఉద్యోగ సంఘాలు. డీఏల చెల్లింపునకు జీవోలు ఇచ్చినప్పటికీ ఇంతవరకూ అమలుకాలేదన్నారు. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనేదానిపై కూడా క్లారిటీ ఇవ్వడం లేదన్నారు.
డీఏ బకాయిలు చెల్లించకున్నా ఉద్యోగుల ఖాతాల నుంచి ఇన్‌కంట్యాక్స్ కట్ చేశారని ఆర్థికశాఖాధికారులకు ఉద్యోగులు తెలియజేశారు. పీఆర్సీ చర్చల్లో డీఏల ప్రస్తావన రాకున్నా రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని జీవోలు ఇచ్చారని... డీఏ బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని అధికారులను కోరారు. సమస్యలు పరిష్కారం కాకుంటే త్వరలోనే కలిసొచ్చే ఉద్యోగ సంఘాలతో కార్యాచరణ రూపొందిస్తామని అల్టిమేటం ఇచ్చారు. నెల రోజుల్లో సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని సూచించారు. లేకుంటే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఏం చేయాలో ఆలోచిస్తామని హెచ్చరించారు.