Chandrababu: చంద్రబాబును కలిసిన వైసీపీ బాధిత మహిళ, సీఎం భరోసాతో ఆరుద్ర కన్నీరుమున్నీరు!
AP News: ఆరుద్ర అనే మహిళ సీఎంను కలిశారు. గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో వైసీపీ ప్రభుత్వం తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని ఆరుద్ర చంద్రబాబుకు వివరించారు.
Chandrababu Amaravati News: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు. తన కుమార్తెతో సచివాలయానికి వచ్చి చంద్రబాబును ఆమె కలిశారు. కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు. తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్రకు వెన్నులో కణితి ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యిందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైన కష్టాలను ఆమె వివరించారు.
అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుద్ర సమస్యలపై స్పందించిన సీఎం.. కుమార్తె సాయిలక్ష్మీ చంద్రకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రతి నెలా రూ.10 వేల పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంత వరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా ఆరుద్ర మాట్లాడుతూ.. చంద్రబాబు గెలుపుతో తన కష్టాలు తీరిపోయినట్లు అనిపించిందని.. ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. సిఎం ఇచ్చిన భరోసాతో ఆరుద్ర సంతోషం వ్యక్తం చేశారు. గతంలో తన సమస్యను అప్పటి సిఎం దృష్టికి తీసుకెళ్లేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ప్రయత్నించగా స్పందించలేదని ఆమె అన్నారు. పైగా ఎదురు కేసులు పెట్టి, వివాదాలు సృష్టించి తనను మానసిక హింసకు గురిచేశారని...పిచ్చిదాన్ని అనే ముద్ర వేశారని ఆరుద్ర కన్నీటిపర్యంతం అయ్యారు. ఆరుద్ర కష్టాలు విన్న ముఖ్యమంత్రి...ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని ఆమెకు హామీ ఇచ్చారు.