Pawan Kalyan: పవన్‌పై జగన్ సర్కార్ క్రిమినల్ కేసు - కోర్టుకు రావాలని ఆదేశాలు
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్ జగన్ ప్రభుత్వం క్రిమినల్ కేసు దాఖలు చేసింది. వలంటీర్లపై పవన్ కల్యాణ్ గత ఏడాది జరిగిన సభలో అనుచితంగా మాట్లాడారంటూ ఆరోపించింది.
Janasena Chief: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వం క్రిమినల్ కేసు (Criminal Case) దాఖలు చేసింది. ప్రభుత్వం తన మానసపుత్రులుగా చెప్పుకుంటున్న వలంటీర్లపై పవన్ కల్యాణ్ గత ఏడాది జరిగిన సభలో అనుచితంగా మాట్లాడారంటూ ఆరోపించింది. వలంటీర్లను కించపరిచేలా, వారి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు దాఖలు చేసింది. దీనిని జిల్లా ప్రధాన న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద పవన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు మార్చి 25న పవన్ కల్యాణ్ విచారణకు హాజరుకావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్‌బాబు నోటీసులిచ్చారు.
అసలు విషయం ఏంటంటే?
గత ఏడాది జులై 9న ఏలూరులో పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 29వేల నుంచి 30వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని ఆరోపించారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా తనకు సమాచారం తెలిసిందన్నారు. రాష్ట్రంలో అదృశ్యమైన మహిళల్లో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని, మిగిలినవారి గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మహిళల అదృశ్యం గురించి డీజీపీ సైతం సమీక్షించలేదని విమర్శించారు.
వలంటీర్ల వల్లే..
రాష్ట్రంలో మహిళ అదృశ్యం వెనుక వలంటీర్ల పాత్ర ఉందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వలంటీర్లు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరించి ఒంటరి మహిళలను గుర్తించి కొంత మంది సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని, వారి ద్వారా వల వేసి అపహరిస్తున్నారని ఆరోపించారు. ఇందులో వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తమున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పినట్లు పవన్ అప్పట్లో వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పత్రికలు, ప్రసార మాధ్యమాలు ప్రముఖంగా ప్రచురించాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం వాటిలో వచ్చిన వార్తలు, కథనాల ఆధారంగా పవన్‌పై కేసు దాఖలు చేసింది.
ప్రభుత్వ పథకాల అమలులో వలంటీర్లు కీలకంగా పనిచేస్తున్నారని, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పవన్ వ్యాఖ్యలున్నాయని ప్రభుత్వం ఫిర్యాదులో పేర్కొంది. ప్రభుత్వంపై కావాలనే బురదజల్లేలా పవన్ మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. అంతకు ముందు జులై 20న పవన్‌పై ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు 20న ఉత్తర్వులిచ్చింది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన వలంటీరు బి.పవన్‌కుమార్‌తోపాటు మరికొంతమంది ఇచ్చిన వాంగ్మూలం మేరకు పవన్‌పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.