Guntur: ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం! బొడ్డు పేగు కొయ్యబోయి శిశువు వేలు కట్, పారిశుద్ధ్య కార్మికురాలి పనే!
బాబు చిటికెన వేలు చివర్లో తెగిందని, ఆపరేషన్ చేసి ఆ తెగిన వేలును అతికిస్తామని ప్రైవేటు ఆస్పత్రి డాక్లర్లు తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు అపనమ్మకం కలిగే ఓ ఘటన తాజాగా జరిగింది. గర్భిణీకి పురుడు పోసిన అనంతరం అప్పుడే పుట్టిన శిశువుకు బొడ్డు తాడు కట్ చేయడంలో పెద్ద తప్పిదం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బొడ్డు కోయబోయి ఏకంగా బిడ్డ వేలు కోసేశారు.. వైద్య సిబ్బంది. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది.
బాధితుల కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్వరూప అనే మహిళ గత నెల సెప్టెంబరు 30న మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. తొలి కాన్పులో భాగంగా ఓ మగ బిడ్డకు జన్మ ఇచ్చింది. అయితే, పురుడు పోసిన అనంతరం ఆమె స్పృహలోకి రాక ముందే బిడ్డకు ఉన్న బొడ్డు తాడు కోసే క్రమంలో వైద్య సిబ్బంది శిశువు కుడి చేతి చిటికెన వేలు కోసేశారు.
దీంతో వెంటనే తమ తప్పును తెలుసుకొని తల్లీ, బిడ్డ ఇద్దర్నీ గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రి జీజీహెచ్ కి తరలించారు. అక్కడ వైద్య పరీక్షించిన అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాబు చిటికెన వేలు చివర్లో తెగిందని, ఆపరేషన్ చేసి ఆ తెగిన వేలును అతికిస్తామని ప్రైవేటు ఆస్పత్రి డాక్లర్లు తెలిపారు. అయితే, ఈ విషయం బయట పడకుండా ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు జాగ్రత్త పడ్డారు.
అయినా, బిడ్డ వేలు తెగిపోయిన సంగతి మీడియాకు తెలిసింది. దీంతో మీడియా ప్రతినిధులు వైద్య విధాన పరిషత్ పల్నాడు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ బీవీ రంగారావును సంప్రదించారు. అయితే, ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ ఘటనకు ప్రధాన కారకురాలు ఓ పారిశుద్ధ్య కార్మికురాలుగా నిర్ణయించామని ఆయన తెలిపారు. అందుకే ఆమెను విధుల నుంచి తొలగించామని చెప్పారు. దీనిపై సమగ్రంగా విచారణ జరుపుతామని వెల్లడించారు. అయితే, ఎంతో అనుభవం ఉన్న గైనకాలజిస్టుల పర్యవేక్షణలో జరగాల్సిన డెలివరీ సమయంలో అక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఎందుకు ఉందనే కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఆ పని చేస్తుండగా, అసలు వైద్యులు ఏం చేస్తున్నారని కూడా సందేహాలు వస్తున్నాయి. అయితే, వైద్య శాఖ విచారణ తర్వాత అసలు నిజానిజాలు తేలే అవకాశం ఉంది. బాధిత బంధువులు మాత్రం ఈ పని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మ ఇచ్చిన అడిషనల్ కలెక్టర్
ఇటు తెలంగాణలో ఓ అడిషనల్ కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోయించుకొని శభాష్ అనిపించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ అయిన త్రిపాఠి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవించారు. సోమవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించినప్పటికీ శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదు. గైనకాలజిస్టులు శ్రీదేవి, లావణ్య, సంధ్యారాణి, విద్య ఆపరేషన్ చేశారు. ఇలా త్రిపాఠి మగ శిశువుకు జన్మనిచ్చారు. శిశువు 3 కిలోల 400 గ్రాముల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవయ్య తెలిపారు.