Free bus for Women: ఆగస్టు 15 నుండి మహిళలకు ఫ్రీ బస్ : మంత్రి నారా లోకేష్
Nara Lokesh News : ఆగస్టు 15 నుండి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

అమరావతి: జూన్ 4 రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. గెలిచింది కూటమి కాదు రాష్ట్ర ప్రజలు అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అన్నారు. ఆగష్టు 15న మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం అమలుచేస్తామని ప్రకటించారు. సుపరిపాలన- తొలిఅడుగు సందర్భంగా ఏపీ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లోకేష్ పాల్గొని మాట్లాడారు. గెలిచింది టీడీపీ, బీజేపీ, జనసేన కాదు.. గెలిచింది కూటమి కాదు గెలిచింది ప్రజలు. 94 శాతం స్ట్రైక్ రేట్ తో 175 స్థానాల్లో ఏకంగా 164 నెలిపించి ప్రజలు రికార్డులు బద్దలు కొట్టారు. చరిత్రను తిరగరాసారు కనుక ఇది ప్రజా విజయమని అన్నారు.
ఆగస్టు 15నుంచి మహిళలకు ఫ్రీబస్
‘గత ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటిన్లు మూసేస్తే.. ప్రజా ప్రభుత్వం 203 అన్న క్యాంటిన్లు తిరిగి ప్రారంభించింది. దీపం పథకం ద్వారా కోటి సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందజేశాం. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సి పోస్టు కూడా భర్తీ చెయ్యలేదు. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తూ మెగా డిఎస్సి నిర్వహిస్తోంది. త్వరలోనే అన్నదాత సుఖీభవ అమలు చేస్తాం. ఆగష్టు 15న మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం అమలుచేస్తాం. గత ప్రభుత్వంలో పాలకులు ప్రజల ఆస్తులు కొట్టేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే దానిని మన ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేస్తే చంద్రబాబు ప్రభుత్వం చెత్త పన్ను ఎత్తేసింది.
5 ఏళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే!
వైసీపీ పాలనలో ఐదేళ్లలో సాధించలేనిది మేం ఏడాదిలో సాధించాం. అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పడం లేదు. చెయ్యాల్సింది ఎంతో ఉంది. గత ప్రభుత్వానికి 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. సీఎం చంద్రబాబు కేవలం ఒకే ఒక్క సంతకంతో పెన్షన్ 1000 రూపాయలు పెంచారు. దేశంలో 4 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దివ్యాంగులకు 6 వేలు, పూర్తిగా బెడ్ కే పరిమితం అయితే 15 వేలు ఇస్తున్నాం. 67,27,164 మంది విద్యార్థులకు ఇటీవల తల్లికి వందనం పథకం అమలు చేసాం. 8745 కోట్లు తల్లుల ఖాతాల్లో వేసాం. మొదటి తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం లో చేరే విద్యార్థులకు త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం.
పేదరికంలేని సమాజం చంద్రబాబు లక్ష్యం
పేదరికం లేని సమాజం చూడాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యం. అందుకే పీ4 కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడమే పీ4 విధానం. బంగారు కుటుంబాలకు చేయూత అందిస్తున్న మార్గదర్శులకు నా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ అన్న ఆధ్వర్యంలో పంచాయతీలకు స్వాతంత్య్రం వచ్చింది. పంచాయితీలకు వెయ్యి కోట్లు నిధులు విడుదల చేసాం. రైతుల నుండి 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడంతో పాటు 13,600 కోట్లు చెల్లించాం. గత వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పెట్టిన 1700 కోట్ల బకాయిలు పెడితే మనం అధికారంలోకి వచ్చాక తీర్చాము. పొగాకు, మిర్చి, కోకో రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటుంది చంద్రబాబు‘ అన్నారు మంత్రి నారా లోకేష్.






















