Voter Registration: ఏపీలో ఓటర్ల నమోదుకు మరో ఛాన్స్.. షెడ్యూలు విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ఏపీలో కొత్త ఓటర్ల నమోదుకు మరో అవకాశం లభించింది. 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని తెలిపింది. http://www.nvsp.in లేదా ఓటర్ హెల్ప్‌లైన్ అనే మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీలో 18 ఏళ్లు దాటి వారికి గుడ్ న్యూస్. రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. దీని కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. వీరితో పాటు గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికీ అవకాశం కల్పించింది. ఈ కార్యాచరణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆగష్టు 9వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఇంటింటి ఓటరు జాబితాను పరిశీలన చేయనున్నారు. కొత్త ఓటర్లతో నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. నవంబర్ 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు అనుమతి ఉంది. నవంబర్ 20, 21న ఓటరు రిజిస్ట్రేషన్ పై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్ తెలిపారు.
ఈ తేదీల్లో పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆ పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓటరు తన వివరాలలో ఏమైనా సవరణలు ఉంటే సరిచేసుకోవచ్చని ప్రకటించారు. http://www.nvsp.in లేదా వోటర్ హెల్ప్‌లైన్ అనే మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 20వ తేదీ నాటికి అభ్యంతరాల పరిశీలన పూర్తి చేస్తారు. జనవరి 5న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు. రాష్ట్రంలో మిగిలిన పురపాలిక, నగరపాలక ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం.ఎం.నాయక్ సంబంధిత మున్సిపాలిటీలు, నగర పంచాయతీల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రచురించనున్నారు. దీంతో నగర పంచాయతీల్లో అన్ని వార్డుల్లో, మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులకు ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.
మిగిలిన స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ లో 11 పురపాలక, నగర పంచాయతీలలో ఎన్నికల్లో గెలిచి వివిధ కారణాలతో కొంత మంది సభ్యులు మృతి చెందారు. వీటిల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సవరించిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని పురపాలకశాఖను ఎన్నికల సంఘం కమిషనర్ ఆదేశించారు. ఆదేశించారు. రాష్ట్రంలోని 75 పురపాలక, నగర పంచాయతీలు, 12 నగరపాలక సంస్థలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించారు. కోర్టు వివాదాలు, ఇతర కారణాలతో కొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికలు నిర్వహించని చోట్ల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దర్శి, కుప్పం, బేతంచర్ల, కమలాపురం, పెనుకొండ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.