CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
ఈ ఆరోగ్య సురక్ష పథకాన్ని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ శుక్రవారం (సెప్టెంబరు 29) ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ ఆరోగ్య సురక్ష పథకాన్ని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ శుక్రవారం (సెప్టెంబరు 29) ప్రారంభించారు. 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటారని.. 10,032 సచివాలయాల పరిధిలో ‘విలేజ్ క్లినిక్స్’ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నామని.. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి ఆరోగ్య సేవలు అందేలా చూస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయం అయ్యే వరకు ఆరోగ్య సురక్ష అండగా ఉంటుందని చెప్పారు.
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒక డాక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంటే ఇంకో డాక్టర్ అంబులెన్స్‌లో గ్రామాల్లోకి వెళ్తారని సీఎం జగన్ తెలిపారు. అయితే, ఇంటింటికీ వెళ్లి అందరికీ వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని చెప్పారు. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలను ఈ డాక్టర్ల ప్రత్యేక టీమ్‌లు కలుస్తాయని చెప్పారు. ఆరోగ్య సురక్షలో భాగంగా ఏడు రకాల వైద్య పరీక్షలను ఇళ్ల వద్దనే డాక్టర్లు, సిబ్బంది నిర్వహించనునన్నట్లుగా చెప్పారు. గ్రామాల్లో సురక్ష క్యాంపులను నిర్వహించి మందులు పంపిణీ చేస్తామని చెప్పారు.
‘‘
గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం లేదు. ప్రివెంటివ్ కేర్‌లో ఇదొక నూతన అధ్యాయం. ప్రస్తుతం 542 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ప్రివెంటివ్ కేర్‌లో ఫ్యామిలీ డాక్టర్ కాన్పెస్ట్‌ను తీసుకురాగలిగాం. ప్రతి మండలంలో 2 పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌లోసీ 104 వాహనం, ఇద్దరు డాక్టర్లు కూడా ఉండేలా చూశాం. జగనన్న సురక్ష ద్వారా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్ చేయబోతున్నాం. ప్రతి ఇంటినీ, ప్రతి గ్రామానీ జల్లెడ పడుతున్నాం. ఇంట్లో ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఉన్నా.. వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్టు డాక్టర్ల చేతవారికి చికిత్స అందిస్తున్నాం. తర్వాత వారికి తదుపరి పరీక్షలు కూడా చేయించి, వారికి అవసరమైన చికిత్సలు అందిస్తున్నాం. నయం అయ్యే దాకా ఆ పేషెంట్‌ను చేయిపట్టి నడిపిస్తాం.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ గురించి, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా గురించి కూడా పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. ఆరోగ్య శ్రీ సేవలు ఏరకంగా పొందుతారనే విషయాన్ని ఈకార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తాం. ఎవ్వరికీ సందేహాలు లేకుండా ప్రతి కుటుంబానికీ అవగాహన కల్పిస్తాం. ఆరోగ్య శ్రీ సేవలు పొందిన తర్వాత సంబంధిత పేషెంటుకు అవసరమైన మందులు అందేలా, ఆ మేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్ చేస్తాం. వీరికి ఎలాంటి సమస్యలేకుండా చూస్తాం. సమయానికి మందులు అందేలా, మళ్లీ అవసరమైన చెకప్‌లు చేయించేలా, అవసరమైన చికిత్స లేదా మందులు అందేలా చూస్తాం. ఈ కార్యక్రమాలన్నీ ఆరోగ్య సురక్ష కింద అందిస్తాం.
క్యాన్సర్ లాంటి పేషెంట్లకు ఖరీదైన మందులు కూడా ఉచితంగా ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తాం. ప్రజారోగ్య రంగంలో జగనన్న ఆరోగ్య సురక్ష కీలక పాత్ర పోషించబోతోంది. ఏ పేదవాడు వైద్యంకోసం ఇబ్బంది పడకూడదనే కార్యక్రమాన్ని ఇందులో చేపడుతున్నాం. మొత్తం ఐదు దశల్లో కార్యక్రమం జరుగుతుంది. మొదటి దశ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ 15 నుంచి జరుగుతోంది. బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ తప్పనిసరిగా పరీక్షలు చేస్తారు. అవసరాన్ని బట్టి యూరిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు చేస్తారు. ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి ఒక్కరినీ టెస్టు చేస్తారు. ఆరోగ్య శ్రీ యాప్ ద్వారా మ్యాపింగ్ చేస్తారు. టెస్టు ఫలితాలు ఆధారంగా ఆరోగ్య శిబిరాల్లో వారికి చికిత్సలు అందిస్తారు. ఆరోగ్య శ్రీని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదానిపై కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తారు’’ అని సీఎం జగన్ చెప్పారు.