CM Jagan: ఈ తోడేళ్లు ఎందుకు ఏకం అవుతున్నాయి? హీరోనే నచ్చుతాడు, విలన్ నచ్చడు - సీఎం జగన్ వ్యాఖ్యలు
జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా నిధుల విడుదల కోసం తిరువూరులో సభ నిర్వహించారు.
మీ బిడ్డ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మంచి చేయలేదని భావిస్తే పొత్తుల కోసం విపక్షాలు ఎందుకు వెంపర్లాడుతున్నాయని ఏపీ సీఎం జగన్ ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా ఈ తోడేళ్లు ఎందుకు ఒక్కటవుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు కనీస అర్హత లేనివాళ్లంతా మనపై రాళ్లు వేస్తున్నారని మాట్లాడారు. సినిమాల్లో కూడా మంచి చేసిన హీరోనే జనానికి నచ్చుతాడని, విలన్ ఎవరికీ నచ్చడని అన్నారు.
జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా నిధుల విడుదల కోసం తిరువూరులో సభ నిర్వహించారు. సీఎం జగన్ ప్రసంగం అనంతరం బటన్ నొక్కి నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.
‘‘ఈ తోడేళ్లు ఎందుకు ఏకం అవుతున్నాయి? పొత్తుల కోసం వీళ్లంతా ఎందుకు వెంపర్లాడుతున్నారు? ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలుస్తుంది. రామాయణమైనా, బైబిల్ అయినా ఖురాన్ లోనైనా మంచి చేసినవారే గెలుస్తారు. ఏ సినిమాలో అయినా సరే మంచి చేసిన హీరోనే నచ్చుతాడు. విలన్ ఎవరికీ నచ్చడు. దత్తపుత్రుడు, దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం.’’
మూడు నెలలకోసారి నిధులు విడుదల
‘‘విద్యార్థులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నాం. ఫీజులు మాత్రమే కాదు వసతి ఖర్చులు కూడా ఇస్తున్నాం. ఏప్రిల్ 11న రెండో విడత వసతి దీవెన నిధులు విడుదల కానున్నాయి. ఈ పథకాలతో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ బడులను, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా చేస్తున్నాం. మీ పిల్లల చదువుకుల పూర్తి బాధ్యత నాది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించాం. రెండేళ్లలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం.
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే. ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. మన కలెక్టర్ ఢిల్లీరావు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. చదువుకు పేదరికం అడ్డుకాకూడదు. మన దేశంలో విద్యాదీవన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవు. కాలేజీ ఫీజులు ఎంతైనా సరే మనమే ఇస్తున్నాం. పూర్తి బాధ్యత మీ జగనన్నదే. గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజులు బకాయిలు పెట్టేవారు. ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదు.
చంద్రబాబు హయాంలోని బకాయిలను కూడా చెల్లించాం. విద్యాదీవెనతో పాటు వసతి దీవెన కూడా ఇస్తున్నాం. తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుంది. కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే మేమే మాట్లాడతాం’’ అని సీఎం జగన్ మాట్లాడారు.
బటన్ నొక్కి రూ.698 కోట్లు విడుదల
జగనన్న విద్యా దీవెన పథకం కింద 2022 ఏడాదికి గానూ అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆదివారం (మార్చి 19) ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సభా వేదికగా బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తోంది. జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు సార్లు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటివి చదివే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు.