వైసీపీలో కొత్తగా జోనల్ ఇన్‌ఛార్జ్‌లు- టార్గెట్ 175 కోసం మరో కీలక నిర్ణయం
ఒక్కో జోన్‌లో 3 నుంచి 5జిల్లాలు ఉండేలా చూస్తారు. ఇందులో యువజన విభాగం, రైతు విభాగం, బీసీ సెల్, వైఎస్‌ఆర్‌టీయూసీ, పంచాయత్ రాజ్ సెల్, విద్యార్థి, వైద్య , మైనారిటీ సెల్ ఇలా విభాగాలు ఉంటాయి.
175 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్ ఆ దిశగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో మరింత బలోపేతమై... ఓటు బ్యాంకుతోపాటు బలమైన కేడర్‌ను నిర్మించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే యాభై కుటుంబాలకు ఒకరు చొప్పున 5.20 లక్షల గృహసారథులను నియమించారు. ఇప్పుడు అలాంటిదే మరో నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే ఎన్నికలు వైసీపీకి చాలా కీలకం. అందుకే గెలుపు గుర్రాలను మాత్రమే పెట్టాలని పార్టీ భావిస్తోంది. ఎలాంటి ప్రయోగాలకు తావులేకుండా కచ్చితంగా గెలిచేవారికే టికెట్లు ఇస్తామంటూ తేల్చి చెప్పేశారు. ఈసారి వారసులకు నో సీట్ బోర్డు పెట్టేశారనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. కొందరు సీనియర్ తమను ఈసారి తప్పించి వారసులకు లైన్ క్లియర్ చేయాలంటూ చేసిన రిక్వస్ట్‌లను జగన్ తిరస్కరించాలన్న మాట గట్టిగానే వినిపించింది.
వారసులను కచ్చితంగా ప్రమోట్ చేయాలన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వినిపిస్తున్న టైంలో పార్టీలో జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారు. 26 జిల్లాలను 8 జోన్లుగా విభజించి దానికి ఇన్‌ఛార్జ్‌లను పెట్టనున్నారు. ఇందులో కూడా వివిధ విభాగాలు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులకు, క్యాడర్‌కు, ప్రజలకు మధ్య సమాచార లోపం లేకుండా చేయడంతోపాటు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించనున్నారు.
ఈ జోన్ల కారణంగా వైసీపీలో ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న సెకండ్ క్యాడర్‌ను ప్రోత్సహించినట్టు అవుతుందని జగన్ ఆలోచన. దీనికి తోడు వారుసులకు గుర్తింపు దొరుకుతుందన్న భావన నేతల్లో కల్పించేందుకు ఇలా ప్లాన్ చేశారట. ఇటు పార్టీకి ప్రచారంతోపాటు తమకు పదవులు దక్కడం లేదన్న అభిప్రాయం ద్వితయ స్థాయి లీడర్లలో లేకుండా చూస్తున్నారట.
26జిల్లాలను 8జోన్లుగా విభజించి ఒక్కో జోన్‌కు ఇన్‌ఛార్జ్‌లను పెట్టనున్నారు. అలా 150 మంది జోనల్ ఇన్‌ఛార్జ్‌లను నియమించనుంది వైసీపీ. ఇప్పటికే కొందరి పేర్లను కూడా ప్రకటించేసిందన్న మాట వినిపిస్తోంది. దీనిపై ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఆ జోన్‌లలో పని చేసుకోవాలంటూ ఆయా లీడర్లకు సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఒక్కో జోన్‌లో మూడు నుంచి ఐదు జిల్లాలు ఉండేలా చూస్తున్నారు. మళ్లీ ఇందులో యువజన విభాగం, రైతు విభాగం, బీసీ సెల్, వైఎస్‌ఆర్‌టీయూసీ, పంచాయత్ రాజ్ సెల్, విద్యార్థి విభాగం , వైద్య విభాగం, మైనారిటీ సెల్ ఇలా విభాగాలు చేయనున్నారు. దీనికి ఒక్కో ఇన్‌ఛార్జ్‌ను పెట్టనున్నారు. ఆయా విభాగాల్లోకి వచ్చిన ప్రజలకు, కేడర్‌కు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వీళ్లు అనుసంధాన కర్తలుగా ఉంటూనే పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.
26 జిల్లాలను ఎనిమిది జోన్లగా విభజించారు. ఇందులో యువతకే అవకాశం కల్పిస్తారు. ఇందులో వారసులకు ఎక్కువ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందట. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఇలా కొంతమందికి యూత్ వింగ్ బాధ్యతలు అప్పగించారని టాక్.
కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల జోనల్ యూత్ వింగ్‌కు ఇన్‌ఛార్జ్‌గా పేర్ని కృష్ణమూర్తిని నియమించారు. నెల్లూరు, వైఎస్‌ఆర్ కడప, తిరుపతి జిల్లాల యూత్ వింగ్‌కు మోహిత్ రెడ్డిని, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జోన్ యూత్ వింగ్‌కు వెంకట్రామిరెడ్డిని నియమించినట్టు తెలుస్తోంది.
మిగతా జిల్లాల యూత్ వింగ్ ఇన్‌ఛార్జ్‌లు
కాకినాడ, కోనసీమ, తూర్పు , పశ్చిమగోదావరి- జక్కంపూడి గణేష్
విజయనగరం, విశాఖ, అనకాపల్లి- ఎం సునీల్ కుమార్
శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు-అవనపు విక్రమ్
కర్నూలు, నంద్యాల- మధుసూదరన్ రెడ్డి
అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య-ఎల్లారెడ్డి ప్రణయ్ రెడ్డి
ఇలా వైద్యులు, ఎస్టీ, మైనార్టీ, బీసీల వింగ్‌లను ఏర్పాటు చేసి ఇన్‌ఛార్జులను నియమించనున్నారు. ఇలా అందర్నీ సమన్వయం చేసుకొని కచ్చితంగా 175 గెలుచుకునేలా జగన్ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేశారు.