Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రాంతీయ మండళ్లు- వచ్చే బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు
Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రత్యేక మండళ్లు ఏర్పాటు చేస్తోంది. బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయనుంది.

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి విషయంలో ఎలాంటి విభేదాలు వచ్చేందుకు ఆస్కారం లేకుండా ఉండేలా ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. దీనికి సీనియర్ ఐఏఎస్‌లను పాలనాధికారులుగా నియమించనుంది. అభివృద్ధి వికేంద్రీకరణ సజావుగా సాగేందుకు దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకే రాష్ట్రాన్ని మూడు జోన్‌లుగా విభజించనున్నారు. ఉత్తరాంధ్ర, అమరావతి, రాయలసీమ అనే ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసి అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
ఈ అభివృద్ధి మండళ్ల ఏర్పాటుపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. బడ్జెట్‌లో మూడు మండళ్లకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని అంటున్నారు. భవిష్యత్‌లో ఏర్పడే పరిశ్రమలకు అనుమతులు, భూకేటాయింపులు, ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన ప్లాన్ తయారు చేయడం , వాటిని అమలు చేయడం ఈ మండళ్ల ప్రధాన కర్తవ్యం. ఈ మండళ్లలలో స్థానిక మంత్రులు, ప్రజా ప్రతినిధులను కూడా భాగం చేయనున్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు పూర్తి అయిన తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి తీసుకురానున్నారు.
తిరుపతి కేంద్రంగా రాయలసీమ అభివృద్ధి మండలి, అమరావతి కేంద్రంగా రాజధాని అభివృద్ధి మండలి, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు కానున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. అయితే అనుకున్నంతగా ఇది విజయవంతం కాలేదు. ఎన్నికల్లో కూడా ఇది తిరస్కరణకు గురైంది.
వైసీపీ మూడు రాజధానుల విధానాన్ని ప్రజలు తిరస్కరించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతిపై ఫోకస్ పెట్టింది. అదే టైంలో ఇతర ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్డ్‌గా ఉన్నామని చెప్పేందుకు ఈ మూడు ప్రాంతీయ మండళ్లను కాన్సెప్టును తీసుకొచ్చింది. గతంలో రాష్ట్రవిభజన అంశంపై వేసిన శ్రీ కృష్ణ కమిటి కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అభివృద్ధి ఒకే ప్రాంతాంలో కేంద్రీకృతం కావడం రాష్ట్రవిభజనకు కారణమైందని పేర్కొంది. అందుకే భవిష్యత్‌లో ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది.




















