Pegasus house committee: పెగసస్‌పై హౌస్ కమిటి సమావేశం- మూడు నెలల్లో నివేదిక ఇచ్చేందుకు రెడీ
పెగసస్‌పై దేశ వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం చెలరేగింది. దేశ స్దాయిలో లింకులు ఏపీలో కూడా ఉన్నాయని అందులో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి.
పెగసస్‌పై ఏపీ అసెంబ్లీ ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. రెండు రోజుల పాటు జరిగిన హౌస్ కమిటీ పలు అంశాలపై చర్చించింది. వచ్చే నెల 5,6 తేదీల్లో మరోసారి హౌస్ కమిటీ సమావేశం జరగనుంది. మూడు నెలల్లో కమిటి నివేదిక ఇవ్వనుంది.
హోమ్ శాఖ, ఐటీ శాఖల అధికారులతో కూడా హౌస్ కమిటి భేటీ అయ్యింది. తొలి రోజున ప్రాథమిక వివరాలపై చర్చించిన కమిటీ.. రెండో రోజు నిఘా పరికరాలు కొనుగోలు, డేటా చోరీకి సంబంధించిన అంశాలపై చర్చించింది. 2016-19 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వంలో అనధికారికంగా పెగసస్ సాఫ్ట్‌వేర్ వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై మమత బెరర్జీ కూడ కొన్ని కామెంట్స్ చేసినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి.
ఈ ఆరోపణలపై నిజ నిర్దారణకు గత అసెంబ్లీ సమావేశాల్లో హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆదేశాలు జారీ చేశారు. పెగసస్‌పై దేశ వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం చెలరేగింది. దేశ స్దాయిలో లింకులు ఏపీలో కూడా ఉన్నాయని అందులో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేపట్టాలని నిర్ణయించారు.
అలా ఏర్పాటైన కమిటీ తొలిసారిగా సమావేశమై కీలక అంశాలపై చర్చించింది. మరికొంత సమాచారం కోసం అధికారులు ప్రయత్నాలు చేయాలని కూడా సూచించింది. ఇందులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం కావటంతో ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం పెగసస్‌ని కొనుగోలు చేసి డేటా చౌర్యానికి పాల్పడిందని.. దీంతోపాటుగా కొన్ని దొంగ పనులు కూడ చేసిందని వైసీపీ శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము ప్రతిపక్షంలో ఉండగా ఈ విషయాన్ని పదే పదే చెప్పినా పట్టించుకోలేదని, దీని వలన జరిగిన నష్టాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతోనే తాము అధికారంలోకి వచ్చిన తరువాత హౌస్ కమిటి నియమించామని అన్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా డేటా చౌర్యం జరిగిందని చెప్పిన విషయాలను భూమన గుర్తు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ప్రైవేట్ ఏజెన్సీ నుంచి సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందనే ఆరోపణలు ఉన్న పరిస్థితుల్లో తాము ఈ అంశాలన్ని పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తామని అన్నారు. ప్రధానంగా వ్యక్తుల ప్రైవేట్ భద్రత, దాడికి సంబంధించి హౌస్ కమిటీ ఏర్పాటు అయ్యిందని, కేవలం పెగసస్ అంశమే కాకుండా గత ప్రభుత్వం హయంలో జరిగిన వ్యక్తి గత భద్రత, దాడులుపై కూడ కమిటి వివరాలను సేకరించి నివేదిక రెడీ చేస్తుందన్నారు. టీడీపీ అప్పట్లో అప్రజాస్వామిక ధోరణితో వ్యవహరించిందని చెప్పారు.