AP Minister Roja: కొడాలి నాని, నేను టీడీపీని అందుకే వీడాల్సి వచ్చింది: మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
Minister Roja: స్వప్రయోజనాల కోసం చంద్రబాబు పార్టీని, రాష్ట్రాన్ని నాశనం చేయడం చూడలేకే కొడాలి, నాని తాను పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు మంత్రి ఆర్కే రోజా.
Minister Roja: ఏపీ రాజకీయాలు రోజురోజుకూ మరింత వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటాను అన్నట్లు ఏపీ రాజకీయాలు మారిపోతున్నాయి. తాజాగా టీడీపీ నేతల తీరుపై మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు హద్దులు దాటి మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. టీడీపీ శ్రేణులు కొడాలి నాని, అంబటి రాంబాబు ఇళ్ల మీదకు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. కొడాలి నాని గడ్డంలోని తెల్ల వెంట్రుకను కూడా టీడీపీ నేతలు పీకలేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భార్య, తల్లితో కలిసి తండ్రిపై ఒత్తిడి తెచ్చి మరీ దొడ్డిదారిన లోకేష్ ఎమ్మెల్సీ, ఆపై మంత్రి అయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. రాజధాని అమరావతిలోని 26 గ్రామాల ప్రజలు వైసీపీ జెండాను తీసివేస్తే.. రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రజలు టీడీపీని కూకటి వేళ్లతో పీకేస్తారని వార్నింగ్ ఇచ్చారు.
అసెంబ్లీకి రాలేని వాళ్లకు ప్రశ్నించే హక్కు లేదు..
సమావేశాలు జరుగుతుంటే అసెంబ్లీకి రాలేని వాళ్లకు వైసీపీ నేతల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కేవలం ప్రజల్ని రెచ్చగొట్టి అందరి సమయాన్ని వృథా చేసే కార్యక్రమాన్ని చేయొద్దని హితవు పలికారు. లా అండ్ ఆర్డర్ కు సమస్యలు వచ్చే పనులు చేస్తే ప్రజలు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వరని చెప్పారు. టీడీపీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి కేవలం పచ్చ మీడియాలో గ్రాఫిక్స్ చూపిందని ఎద్దేవా చేశారు. అమరావతి ఉన్న రెండు ఎమ్మెల్యే సీట్లను 2019లో వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుందని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో రైతులకు, ప్రజలకు న్యాయం చేయలేదని గుర్తించబట్టే వైఎస్ఆర్ సీపీని గెలిపించారన్నారు. టీడీపీ నేతలు, వారి బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు.. 26 జిల్లాల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజీనామా చేయమని అడిగితే ఊరుకునేది లేదు..
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ అవమానిస్తే దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు వచ్చారని గుర్తుచేశారు మంత్రి రోజా. ఆ సమయంలో ప్రజలకు వైఎస్ఆర్ సీపీ అండగా నిలిచిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ఆ ఎంపీలకు ప్రజలకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. అలాగే టీడీపీ వాళ్లు నేతలు అమరావతినే మూడు ప్రాంతాల ప్రజలు కోరితే... మేం ఎందుకు రాజీనామా చేయాలని మంత్రి రోజా ప్రశ్నించారు. ప్రతీసారి సీఎం జగన్ ను రాజీనామా చెయ్ అని మాట్లాడితే.. ఊరుకునేది లేదన్నారు. సీఎం జగన్ తన సొంత జెండా, అజెండాతో ప్రజల్లో తిరిగి భరోసా కల్పించుకొని తిరుగులేని నాయకుడు అయ్యారన్నారు. తాను ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చారన్నారు. ప్రతీ ఇంటి బిడ్డగా సీఎం జగన్ ముందుకెళ్తున్నారని తెలిపారు.
చంద్రబాబు వల్లే మేం టీడీపీని వీడాం..
మహానేత ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని, రాష్ట్రాన్ని నాశనం చేయడం వల్లే ఆ పార్టీలో ఉండలేక కొడాలి నాని, తాను బయటకు వచ్చేశామని మంత్రి రోజా తెలిపారు. కొడాలి నాని మాట్లాడిన మాటల్లో తప్పేముందని అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే.. ఆడవాళ్లను ఇళ్ల మీదకు పంపించారని ఆరోపించారు. తామంతా వేసీపీకీ, సీఎం జగన్ కు అండగా నిలబడతామని తెలిపారు. గతంలో మంత్రి విశ్వరూప్ ఇంటిని ఎలా తగులబెట్టారో, అంబటి రాంబాబు ఇంటి మీదకు ఎలా పోయారో చూశామన్నారు. టీడీపీ వాళ్లు ఏం చేసినా, ఎన్ని చేసినా పోలీసులు వారిని ఏమీ అనకూడదని కేసులు పెట్టకూడదని ప్రతిపక్ష నేతలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు.