Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
contempt of court petition: హైకోర్టు న్యాయమూర్తులు, దిగువకోర్టు జడ్జిలపై దూషణలు జరిగాయన్న కేసులో విచారణ నాలుగు వారాలు వాయిదా పడింది. 26 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Criminal Contempt petition:
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత హైకోర్టు న్యాయమూర్తులు, దిగువకోర్టు జడ్జిలపై దూషణలు జరిగాయన్న కేసులో విచారణ నాలుగు వారాలు వాయిదా పడింది. కొందరు జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరిని ప్రతివాదులుగా పేర్కొంటూ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.
చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల్లో హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణల పర్వం కొనసాగింది. దీనిపై ఏజీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులను దూషిస్తున్నారని ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయని బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు. సామాజిక మాధ్యమాల్లో కొంత మంది జడ్జిలను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్నారని ఏజీ శ్రీరామ్ వాదించారు. ఇలాంటి పనులు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని, ఈ 26 ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర డీజీపీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. న్యాయమూర్తులపై దూషణల కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది కోర్టు.
వారిపై చర్యలు తీసుకోండి - రాష్ట్రపతి భవన్ నుంచి ఏపీ సీఎస్ కు లేఖ
ఏపీ సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును విచారిస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ వచ్చింది. అడిషనల్ సెషన్స్ జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం, ట్రోల్స్ పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు వెళ్లింది. చంద్రబాబు స్కిల్ కేసులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్ రామానుజరావు ఈ-మెయిల్ ద్వారా ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన అనంతరం జడ్జి హిమబిందు హిమబిందు వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జడ్జికి సంబంధించిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా ఏపీ సీఎస్ కు లేఖ రాశారు.
కోర్టు ధిక్కరణ అంటే ?
కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ -1971 ప్రకారం కోర్టు ధిక్కరణ రెండు రకాలుగా వ్యవహరించవచ్చు. సివిల్ కంటెంప్ట్ మొదటిది కాగా, క్రిమినల్ కంటెంప్ట్ రెండో రకం కోర్టు ధిక్కరణగా పరిగణించవచ్చు. కోర్టులు ఇచ్చే ఏదైనా తీర్పులు, లేదా ఆదేశాలు, కోర్టు ప్రక్రియ విషయాలను ఉద్దేశపూర్వకంగా అనుసరించకపోవడాన్ని సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అని చెప్పవచ్చు. కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం కావాలనే పాటించకపోవడం ఇందులోకి వస్తుంది.
క్రిమినల్ కంటెంప్ట్ అంటే కొన్ని నిబంధనలపై వ్యాఖ్యలు చేయడం లేదా ప్రచురించడం.. సంజ్ఞల రూపంలో ఉల్లంఘించినట్లయితే దీని కిందకి వస్తుంది. ఇది మూడు రకాలుగా ఉంటుంది. కోర్టు ప్రక్రయల్లో జోక్యం చేసుకోవడానికి యత్నించడం లేక పక్షపాతం చూపించడం, కోర్టు గౌరవాన్ని దిగజార్చే పని చేయడం లేక దూషణలకు దిగడం, న్యాయ పరిపాలన ప్రక్రియలకు ఏదో విధంగా అడ్డుపడటం లాంటివి క్రిమినల్ కంటెంప్ట్ కోవలోకి వస్తాయి.