AP High Court: ఏపీ డీఎస్సీపై హైకోర్టులో విచారణ, ప్రభుత్వాన్ని నిలదీసిన ధర్మాసనం!
చీఫ్ జస్టిస్ సెలవులో ఉన్నందున ఈ పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు వస్తే దేశవ్యాప్తంగా అమలు కావాల్సిందే కదా అని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.
AP DSC Notification 2024: ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ వ్యవహారంపై ఏపీలో హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం మధ్యాహ్నం జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం అనేది సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధం అని.. పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. B.Ed అభ్యర్థులను అనుమతించడం వల్ల 10 లక్షల మంది D.Ed అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని వాదించారు. సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టిందని పిటినర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. సుప్రీం కోర్టు తీర్పు దేశవ్యాప్తంగా అమలు కావాలి కదా? అని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.
తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందన్న పిటిషనర్ ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పు మీకు వర్తించదా అని హైకోర్టు అడిగింది. ఒక్కసారి సుప్రీం కోర్టు ఆదేశాలు వస్తే అవి దేశవ్యాప్తంగా అమలు కావాల్సిందే కదా అని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అయితే, చీఫ్ జస్టిస్ సెలవులో ఉన్నందున ఈ పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది.