AP High Court: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట, ఈ నెల 20 వరకు అరెస్ట్ లేనట్టే
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట లభించింది. టిడిపి ఆఫీస్ పై దాడి కేసులో 71వ నిందితుడిగా ఉన్న వంశీని ఈనెల 20 వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Former MLA Of Gannavaram Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీపై దాడి కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు కొన్నాళ్లు నుంచి వేట కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌కు హైకోర్టును వంశీ ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఈ నెల 20 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
గతేడాది ఫిబ్రవరి 20న తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ తీవ్రంగా దెబ్బతింది. ఫర్నీచర్, వాహనాలు ధ్వంసమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసును తిరగదోడింది. ఇప్పటి వరకు దాడికి పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరులు ఉన్నారు. వీరంతా వంశీ పేరు చెప్పడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే వంశీ ముందస్తు బెయిల్ ఫిటిషన్‌ను హైకోర్టులో వేశారు. బుధవారం మధ్యాహ్నం హైకోర్టులో వాదనలు జరిగాయి. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వంశీపై వ్యవహరిస్తూ కేసు నమోదు చేసిందని వంశీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దాడిలో వంశీ ప్రమేయంపై పూర్తి ఆధారాలు ఉండడంతోనే అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రభుత్వం తరపు లాయర్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఈ నెల 20 వరకు వంశీని అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులు, సీఐడీ అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజా ఉత్తర్వులు వల్లభనేని వంశీకి భారీ ఊరటగా చెప్పవచ్చు. కొద్దిరోజులుగా వంశీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే.