చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో తన ప్రమేయం లేదని కేసు కొట్టివేయాలని చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
స్కిల్ డెవలప్‌మెట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. హైకోర్టు ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టిసిన హైకోర్టు తీర్పుకాపీలో చాలా ఆంశాలపై క్లారిటీ ఇచ్చింది. సెక్షన్ 482 సీఆర్‌పీసీకీ సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని పేర్కొంది. నిహారిక ఇన్‌ఫ్రా vs మహారాష్ట్ర ప్రభుత్వం కేసును న్యాయమూర్తి ఉదహరించారు. ఇన్ని ఆధారాలున్న ఈ కేసులో క్వాష్ పేరిట ఇప్పుడు మినీ ట్రయల్ నిర్వహించలేమని స్పష్టం చేసింది. 2021 నుంచి ఇప్పటివరకు 140 మంది సాక్షులను సీఐడీ విచారించిందని తెలిపింది. దాదాపు 4వేల డాక్యుమెంట్ ఆధారాలను పరిశీలనలోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ కేసు అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సిందని కోర్టు భావిస్తోందన్నారు. ఈ కేసును క్వాష్ పేరిట నిలిపివేయలేమని... దర్యాప్తును నిలువరించలేమని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో నిందితులకు ఎలాంటి ఊరట కలిగించలేమని... దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లు డిస్మిష్ చేస్తున్నట్టు తీర్పు చెప్పింది.
క్వాష్ పిటిషన్‌పై ఇరుపక్షాల న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదించారు. హోరాహోరీగా సాగిన వాదనల్లో కొన్ని కీలక అంశాలను ఇరు పక్షాలు లెవనెత్తాయి. ఇది పూర్తిగా రాజకీయ కుట్రతో పెట్టిన కేసు అని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. పలు ఉదాహరణలు చెప్పారు. చంద్రబాబు తప్పు చేశారన్న దానికి ఒక్క సాక్ష్యం కూడా లేదన్నారు. పైగా అరెస్టు కూడా తప్పుడు పద్దతిలో చేశారని.. గవర్నర్ అనుమతి తీసుకోలేదన్నారు. అరెస్ట్ చేసే నాటికి ఎఫ్ఐఆర్ లో పేరు లేదన్నారు. ఈ సందర్భంగా పలు కేసులను హరీష్ సార్వే న్యాయమూర్తికి వివరించారు. అర్నాబ్ గోస్వామితో పాటు రాఫెల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులనూ వివరించారు.
ప్రభుత్వం తరపు లాయర్లు కూడా అదే స్థాయిలో వాదనలు వినిపించారు. చంద్రబాబు తప్పు చేశారని వాదించారు. ఇంకా దర్యాప్తు జరుగుతోందని మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉందన్నారు. స్కిల్ కాంట్రాక్టు పొందిన డిజైన్ టెక్.. సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చిందని వారు నిధులు దారి మళ్లించారని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో డబ్బులు గోల్ మాల్ అయ్యాయంటున్నారని.. కానీ మొత్తం ఒప్పందానికి తగ్గట్లుగా స్కిల్ సెంటర్లు పెట్టారని.. మొత్తం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ టూల్ డిజైన్ సహా ఆరు వ్యవస్థలు భాగమయ్యాయని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు.
రిమాండ్ రిపోర్టులో ఉన్నవి, ప్రెస్ మీట్లలో సీఐడీ చీఫ్ సంజయ్ తో పాటు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పినవి .. కూడా ప్రభుత్వం తరపు లాయర్లు కోర్టులో చెప్పారు. సుదీర్ఘంగా సాగిన వాదనల తర్వాత తీర్పును మాత్రం రెండు రోజులుగా వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు సీఐడీ తీర్పుతో ఏకీభవించిన న్యాయమూర్తి చంద్రబాబు పిటిషన్ కొట్టేస్తూ నిర్ణయం తీసుకున్నారు.