నియోజకవర్గాల్లో పర్యవేక్షకుల నియామకంపై జగన్ ఫోకస్- టెన్షన్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు
గడప గడపకు మన ప్రభుత్వం ద్వార ప్రజల్లో వెళ్లి తీరాల్సిందేనని జగన్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఎమ్మెల్యేలకు కూడా అసలు విషయాలు బోధపడ్డాయి అంటున్నారు.
వైసీపీలో జిల్లా అధ్యక్షుల మార్పు పూర్తయ్యింది. పని తీరు బాగోలేని నేతలను మార్చేస్తామంటూ సీఎం జగన్ చెప్పినట్లుగానే జాబితాలో మార్పులు జరిగాయి. కొత్త వారికి అవకాశాలు ఇచ్చి, పాత వారిని పక్కన పెట్టారు. ఇక ఇప్పుడు తరువాత భాగం నియోజకవర్గాల ఎమ్మెల్యేలదేనని ప్రచారం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
నియోజకవర్గాలపై ఫోకస్
వైసీపీలో నియోజకవర్గాల శాసనసభ్యులపై ఇప్పటికే ఫుల్‌గా ఒత్తిడి పెరిగింది. ఎమ్మెల్యేలకు గడప గడపకు టార్గెట్ పెట్టిన జగన్ వారి పని తీరుపై ప్రత్యేకంగా సర్వే చేయిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్ని గంటలపాటు ప్రజల్లో ఉన్నారు, వారి పని తీరు ఎలా ఉంది, ప్రజల్లో మార్కులు పడుతున్నాయా లేదా, ప్రజలకు దగ్గరగా ఉంటున్నారా లేదా అనే విషయాలను పీకే టీంతోపాటుగా, ప్రైవేట్ సంస్థలతో కూడా జగన్ సర్వే చేయిస్తున్నారు. ఇప్పుడు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలతోపాటుగా, పర్యవేక్షకులను నియామకానికి రంగం సిద్ధమైందని తెలుస్తుంది.
ప్రస్తుత ఎమ్మెల్యేల పట్ల, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని, సర్వేల్లో ఆశించిన ఫలితాలు రాని వారిని గుర్తించి, ఆయా స్థానాల్లో కొత్తవారిని అభ్యర్థులుగా తీసుకొస్తారన్న చర్చ వైసీపీలో మొదలైంది. ఇప్పటికే ఈ తరహా ప్రచారం కొన్నినియోజకవర్గాల్లో అమలు చేశారు కూడా. ఇందుకు తాడికొండ, మైలవరం వంటి నియోజవకర్గాలను ఉదాహరణగా చెబుతున్నారు. పార్టీ తరపున ప్రత్యేకంగా సర్వే చేయడంతోపాటు.. ఐప్యాక్ టీం అన్ని నియోజకవర్గాల్లో నిఘా పెట్టి సర్వేలు చేసింది. వాటి ఫలితాల ఆధారంగానే టికెట్లు ఉంటాయన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. చాలా నియోజకవర్గాల్లో పార్టీ వర్గాలు ఐ ప్యాక్ టీంలకు టచ్‌లో ఉంటూ తాము చేసిన పనులను ప్రచారం చేసుకునే పనిలో ఉన్నారు.
నియోజక వర్గాలకు పార్టీ పర్యవేక్షకుల నియామకంపై సీఎం గత మూడు రోజులుగా సమీక్షిస్తుండటంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందనే ప్రచారం జరుగుతుంది. పని తీరు మెరుగురచుకోండి, లేదంటే కొత్త వారిని నియమించటం ఖాయం అని సీఎం జగన్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల పని తీరులో కూడా జగన్ తాను చెప్పినట్లుగానే క్లారిటి ఇచ్చారు. పని తీరు బాగోలేని వారిని, ఇప్పటికే రాజీనామాలు చేసి చేతులు ఎత్తేసిన వారి స్థానాల్లో కొత్త వారిని నియమించి, 26జిల్లాల బాబితాను ఇప్పటికే ప్రకటించారు.
ఎమ్మెల్యేలకు తలనొప్పి
గడప గడపకు మన ప్రభుత్వం ద్వార ప్రజల్లో వెళ్లి తీరాల్సిందేనని జగన్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఎమ్మెల్యేలకు కూడా అసలు విషయాలు బోధపడ్డాయి అంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు సంవత్సరాలపాటు కరోనా కాలం సరిపోయింది. ఆ తరువాత ఎడాది అంతంమాత్రంగానే మారింది. దీంతో ప్రజల సమస్యలు, పెండింగ్ పనులు, ఇచ్చిన హామీలు, అమలు ఇలా అన్ని విషయాలు ఎమ్మెల్యేలను చుట్టుముట్టాయి. దీంతో చాలా రోజులు తరువాత బయటకు వచ్చిన శాసన సభ్యులకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాటిని అదిగమించి, ఇప్పుడిప్పుడే ప్రజల్లో మార్కులు సాధించేందుకు ప్రయత్నిస్తుంటే, ఇదే సమయంలో నియోజకవర్గాలకు పర్యవేక్షకుల నియామకం అంటూ మరింత ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు.
సెప్టెంబరు 28న నిర్వహించిన సమీక్షలో జగన్ ఎమ్మెల్యేలు, ఎంత మంది ఎక్కడకు వెళ్లారు, ఎక్కడెక్కడ తిరాగారు, అనే విషయాలు నివేదికలతో సహా బయట పెట్టి, పని తీరుకు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు. దీంతొ మిగిలినవారు కూడ అలర్ట్ కావాల్సి వచ్చింది.