Sajeeva Charitra Book Launch Event: భారత రాజకీయాల్లో 1983 ఒక సంచలనం, కాంగ్రెస్ పాలనకు NTR గుణపాఠం: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu | 1983 సంవత్సరం భారత రాజకీయాల్లో ఒక సంచలనం, కాంగ్రెస్ పాలనకు NTR గుణపాఠం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.

అమరావతి: 1983వ సంవత్సరం భారత రాజకీయాల్లో ఒక సంచలనంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘సజీవ చరిత్ర’ పుస్తకాన్ని విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్సులో మంగళవారం రాత్రి చంద్రబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Vekaiah Naidu), త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, తదితర ప్రముఖులు హాజరయ్యారు.
సజీవ చరిత్ర పుస్తకం విడుదల
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 1984లో చోటు చేసుకున్న వాస్తవాలను సజీవ చరిత్ర పుస్తకం ద్వారా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. మూడున్నర దశాబ్దాల పాటు కొనసాగిన కాంగ్రెస్ పాలనకు 1983లో జరిగిన ఎన్నికలు గుణపాఠంగా మారాయని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గురించి తన ప్రసంగంలో స్ఫూర్తిదాయకమైన విషయాలను గుర్తుచేశారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని గొప్పగా ప్రకటించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన నేత ఎన్టీఆరేనని, ఇప్పుడు దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం అమలవుతోందని పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.
ఆ సమయంలో 161 మంది ఎమ్మెల్యేలతో రామకృష్ణ స్టూడియోకు వెళ్లి క్యాంప్ పెట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పట్లో 18 నెలలకే ప్రభుత్వాలు మారడం కాంగ్రెస్ పాలనలో సాధారణమైపోయింది. ఆ సమయంలో జరిగిన ఎన్నికల సంగ్రామంలో పోరాడి గెలిచిన వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. ప్రజాస్వామ్యంపై జరిగిన ద్రోహానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పారని సీఎం చంద్రబాబు అన్నారు.
ఎన్టీఆర్ తెలుగు వైభవం, తెలుగుదనానికి ప్రతిబింబం. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక. దేశానికి సంక్షేమం పరిచయం చేసిన ఎన్టీఆర్ స్పూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం.#ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/0hQL3sr6x4
— Telugu Desam Party (@JaiTDP) September 16, 2025
ఆ సమయంలో ఉమ్మడి ఏపీ గవర్నర్ రామ్‌లాల్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను సీఎం చంద్రబాబు తాజాగా విమర్శించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చారు. ప్రజాస్వామ్యానికి అండగా నిలవడం ఎంతో ప్రాధాన్యం కలిగిన విషయం. ఎవరూ ఆశ్రయం ఇవ్వకపోతే రామకృష్ణ హెగ్డే మాత్రమే అప్పట్లో కర్ణాటకలో ఎన్టీఆర్‌కు ఆశ్రయం ఇచ్చారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.
స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న రావాలి
తెలుగు జాతి గర్వించే వ్యక్తి, గొప్ప నటుడు, ప్రజా పాలకుడు అయిన ఎన్టీఆర్‌కు భారతరత్న రావాలి, అది సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఎన్టీఆర్ వేసిన ఫౌండేషన్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ స్థిరత్వానికి కీలకంగా మారింది. ఆయన స్థాపించిన కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమం దేశవ్యాప్తంగా కొనసాగుతుందని చంద్రబాబు అన్నారు.
వెంకయ్య నాయుడు నాయకులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. అప్పట్లో ఎమ్మెల్యేలను సమీకరించడంలో ఇంద్రసేనారెడ్డి చేసిన కృషిని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో ఎన్టీఆర్ రాజకీయ జీవితం, సంక్షేమంపై చూపిన నిబద్ధతను స్మరించుకుంటూ, తన ఆలోచనలతో దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన నేతగా ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు.






















