Chandra Babu:ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్క్- దిల్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandra Babu: ఇంటికో పారిశ్రామికవేత్త, ప్రతి నియోజకవర్గానికి పారిశ్రామికపార్క్ ఏర్పాటు దిశగా ప్రణాళికలు రచిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ధిల్లీలో జరిగిన CII సదస్సులో పాల్గొని కీలక ప్రకటన చేశారు.

Chandra Babu: ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తామని మఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పారిశ్రమలను ప్రోత్సహించి బిజినెస్ ప్రారంభమైతేనే ఆదాయం పెరుగుతుందని అన్నారు. అప్పుడే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వగలమని పేర్కొన్నారు. ఇప్పుడు చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. బిజినెస్ సెక్టార్‌లో ఉన్న భయాలు తొలగించే ప్రయత్నం మహానాడు వేదికగా చేశామని వెల్లడించారు. దిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఏపీ ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల అవకాశాలు వచ్చిన వాళ్లకు వివరించారు.
175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇంటికో పారిశ్రామికవేత్త తయారు చేయాలన్నదే లక్ష్యమన్నారు. మొదటి నుంచి పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తూ వచ్చామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి అనేక సదస్సు నిర్వహించి భారీగా పెట్టుబడులు ఆహ్వానించామని తెలిపారు. ఆ ఫలితాలు కనిపిస్తున్నాయని ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నామని వివరించారు.
ప్రజలకు సంక్షేమ ఫలాలు అందివ్వాలన్నా, రాష్ట్రాభివృద్ధి సాధించాలన్నా పారిశ్రామికవేత్తలతోనే అవుతుందని తెలిపారు చంద్రబాబు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సంస్కరణలు చేపట్టి సంపద సృష్టించామని అన్నారు. అవకాశాలను అనుకూలంగా మార్చుకొని రాష్ట్రాన్ని నూతన మార్గంలో నడిపించామన్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, డ్రోన్లు అభివృద్ధిలో కీలక పాత్రపోషిస్తాయని అందుకే వాటిని ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు. సీసీ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీలు ఇలా టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
ఇప్పుడు అందివస్తున్న అవకాశాలు వినియోగించుకొని సవాళ్లు అధిగమించిన వాళ్లే రాణిస్తారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకు ప్రభుత్వం చేయూత అందిస్తే ఇంటికో పారిశ్రామికవేత్త రావడం పెద్ద కష్టం కాదన్నారు. ఇలాంటి సరైన సమయంలో మోదీ లాంటి నాయకులు ప్రధానిగా ఉండటం దేశానికి బలం అని అభిప్రాయపడ్డారు.
అటు కేంద్రంలో ఇటురాష్ట్రంలో ప్రభుత్వాలు పటిష్టంగా ఉన్నందున పెద్ద పెద్ద సంస్థలు ఏపీకి వస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. విశాఖలో టీసీఎస్, ఆర్సెల్లార్ మిట్టల్, గూగుల్ ఇలాంటి సంస్థలు త్వరలోనే పనులు ప్రారంభిస్తాయని వివరించారు. గ్రీన్ ఎనర్జీకి, సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీకి ఏపీలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అనుకున్న ప్రాజెక్టులు లైవ్ అయితే నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు.
అంతకు ముందు పార్టీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు కంటిన్యూగా అధికారంలో ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్న సీఎం ఇప్పుడు మరోసారి పొరపాటు జరగకుండా చూడాలని అన్నారు. ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. కడప మహానాడు వేదికగా ఇదే అంశాన్ని స్పష్టం చేశామని వివరించారు. మహానాడు అద్భుతంగా జరిగిందని జిల్లా నాయకత్వమంతా సమష్టింగా పని చేసి కార్యక్రమాన్ని సక్సెస్‌ఫుల్ చేశారని కితాబు ఇచ్చారు. అందర్నీ అభినందించారు. మహానాడులో ప్రవేశ పెట్టిన శాసనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో చాలా ఆశలు ఉన్నాయని అదే టైంలో సానుకూలత ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. త్వరలోనే సంక్షేమ క్యాలెండర్ ప్రకటిస్తామని పేర్కొన్నారు. అలా ప్రకటించడానికి ముందు సంపద సృష్టిపై దృష్టి పెట్టామన్నారు. సంపద సృష్టించకపోతే సంక్షేమ ఫలితాలు ప్రజలకు అందివ్వలేమని పేర్కొన్నారు.





















