Andhra Pradesh Weather Today: ఆంధ్రప్రదేశ్‌లో నేడు కుంభవృష్టి- కృష్ణా, గుంటూరులో ఆగని వాన
Andhra Pradesh Weather:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలు నీట మునిగాయి.

Andhra Pradesh Weather Today : పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కు ముసురుపట్టింది. అన్ని జిల్లాల్లో జోరువానలు పడుతున్నాయి. కుండపోత జనజీవనాన్ని స్తంభింపజేసింది. రైతుల్లో మాత్రం ఆనందం వెల్లివిరిస్తోంది. ఇన్ని రోజులు వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందిన రైతులు ఈ వానలతో కాస్త ఊరట పొందారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ముంచెత్తే వానలు మాత్రం టెన్షన్ పెట్టిస్తున్నాయి.
రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తున్న వేళ విపత్తుల సంస్థ కార్యలయం నుంచి కోస్తా జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ లైన్ డిపార్టమెంట్ అధికారులతో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్పపీడనం రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్యకోస్తా జిల్లాల్లో గురువారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి వాతావరణ వివరాలు స్వయంగా పరిశీలించారు. ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించారు.
అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు అనిత. జిల్లాల్లోను కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో అధికారులు వర్ష ప్రభావ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.44,638 క్యూసెక్కులు ఉంది. ఇది గురువారం నాటికి మరింత పెరిగి మొదటి హెచ్చరిక వరకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. గరిష్టంగా 4–4.5 లక్షల క్యూసెక్కులు చేరవచ్చుని అంచనా వేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లా అధికారులు నదీపరివాహక లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేయాలని హోంమంత్రి సూచించారు. వాగులు, కాలువలు, కల్వర్టర్లు పొంగుతున్నందున ప్రమాద ప్రాంతాల్లో తప్పని సరిగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
NDRF, SDRF బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్, పడిన చెట్లను వెంటనే తొలగించాలని ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రజలు హోర్డింగ్స్, శిథిలావస్థలో ఉన్న భవనాలు,గోడలు, చెట్ల వద్ద ఉండరాదని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాల్లోని వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
వర్షాలతో నీట మునిగిన ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లా అధికారులతో అనిత ప్రత్యేకంగా మాట్లాడారు. ముందస్తుగా తీసుకున్న చర్యలను కలెక్టర్లు ఆమెకు వివరించారు. గ్రామ సచివాలయాల్లో 24 గంటలూ అధికారులను అందుబాటులో ఉంచామని తెలిపారు. వాగులు పొంగడంతో వరదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేశామని మంత్రికి వెల్లడించారు. ఇసుక బ్యాగులు, నిత్యవసర వస్తువులు వంటివి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
వర్షాలు భారీగా కుస్తున్న వేళ కృష్ణా జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. 81819 60909 వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు- 0866-2427485, 0866-2424172, 0866 2427485. ఇక్కడ సిబ్బంది మూడు షిఫ్టులలో అందుబాటులో ఉంటారు.
ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్స్‌కు సెలవులు
ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద ఉద్ధృతి కారణంగా జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గురువారం సెలవలు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు ఒక ప్రకటన విడుదల చేశారు.
కృష్ణానదిలో ఇద్దరు యువకులు గల్లంతు
తుళ్లూరు మండలం లింగాయపాలె వాసులు ఇద్దరు కృష్ణా నదిలో గల్లంతు అయ్యారు. డ్రెడ్జింగ్ వద్ద ఉన్న పడవ తెచ్చుకునేందుకు ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. పడవ లాగే సమయంలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో ముగ్గురు కూడా నీటిలో కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన వారిలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అతి కష్టమ్మీద ఒడ్డుకు చేరుకున్నాడు. మిగిలిన ఇద్దరు యువకులు కామేశ్వరరావు, ఉపేంద్ర గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం పోలీస్, రెవెన్యూ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపడుతున్నారు.
విజయవాడలో అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరు మృతి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గులాం మొహిద్దీన్ వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 10 నుంచి 14 అడుగుల గోతుల్ని తీసి అధికారులు వదిలేశారు. కురుస్తున్న వర్షాలకు అందులోకి నీరు చేరడంతో అక్కడ గోతులు ఉన్నాయన్న విషయం గుర్తు పట్టలేని పరిస్థితి. ఇలానే గీతా మందిరం సందు చివర వద్ద తీసిన గోతిలో తిరువాయిపాటి మధుసూదన్ రావు పడి చనిపోయాడు. జండా చెట్టు వద్ద షేక్ ముర్తజ్ కొట్టుకుపోయి చనిపోయాడు. ఎండాకాలంలో చేయాల్సిన డ్రైనేజ్ పనులను వర్షాకాలంలో చేసి ప్రజల ప్రాణాలు పోయేలా చేశారని స్థానికులు మండిపడుతున్నారు.
రైతులను ఆదుకోండి మహాప్రభో అంటున్న రైతలు
తీవ్ర నష్టాలలో మునిగి పోయాం మమ్మల్ని ఆదుకోండి అంటూ ఉండవల్లి రైతులు వేడుకుంటున్నారు. భారీ వర్షానికి ఉండవల్లిలో 70 ఎకరాల్లోని వరిపంట నీట మునిగిందని రైతులు కన్నీటి పర్యంతమవుతన్నారు. ఎకరా పొలంలో పంట వేయడానికి 25వేల రూపాయలు ఖర్చు చేశామని ఇప్పుడదంతా నీటిపాలైందంటూ బోరుమంటున్నారు. ఈ సీజన్ లోనే మూడుదఫాలుగా పంట వేస్తే మూడుసార్లు మునిగి నష్ఠ పోయామంటూ వాపోతున్నారు.





















