హయ్యర్ స్టడీస్‌లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్, జీవో విడుదల చేసిన ఏపీ సర్కారు
ఉన్నత విద్యలో దివ్యాంగులకు ఐదు శాతం సీట్లు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనికి తోడు ఐదేళ్ల వయోసడలింపు కూడా ఇచ్చింది.
దివ్యాంగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వం గ్రాంటుతో నడుస్తున్న విద్యా సంస్థల్లో ఐదు శాతానికి తగ్గకుండా సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. వీటిలో ప్రవేశానికి వారికి ఐదేళ్ల సడలింపు కూడా ఇస్తూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం అంగవైకల్యం ఉన్న వారందరికీ ఈ రూల్స్ వర్తిస్తాయి. 44 శాతానికి తక్కువ కాకుండా ఉన్న వారికి ఐదు శాతం రిజర్వేషన్, ఐదేళ్ల వయపరిమితి సడలింపు వర్తించనుంది. దివ్యాంగులకు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు సూచనల మేరకు దివ్యాంగుల కోసం విద్యాసంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్, ఐదేళ్ల సడలింపు వర్తించేలా కొత్త జీవో తీసుకొచ్చింది. దివ్యాంగుల హక్కులకు సంబంధించి ఏప్రిల్ 20న కొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
ప్రస్తుతం ఈ ఆదేశాలతో ప్రతి ఏడాది ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరిపే టైంలో దివ్యాంగులకు చెప్పిన శాతం మేర సీట్లు కేటాయిస్తారు. వయో పరిమితి సడలింపు కూడా వర్తింపజేస్తారు. ఇలా అమలు అయ్యేలా చూడాలంని అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఆయా శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది.