Andhra Pradesh: న్యాయమూర్తులపై దూషణలు: హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
Contempt of court petition filed in High Court : న్యాయమూర్తులపై కొంత మంది చేసిన దూషణలపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషణ్ దాఖలు చేశారు అడ్వకేట్ జనరల్.
Contempt of court petition filed in High Court: న్యాయమూర్తులపై కొంత మంది చేసిన దూషణలపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు అడ్వకేట్ జనరల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల్లో హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణల పర్వం కొనసాగింది. దీనిపై ఏజీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులను దూషిస్తున్నారని ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయని పిటిషన్‌లో వెల్లడించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ లో చంద్రబాబు అరెస్టు అనంతరం గడచిన రెండు వారాల్లో జరిగిన పరిణామాలను వివరిస్తూ ఏజీ పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే కోర్టుల గౌరవానికి భంగం కలిగించారని పిటిషన్ లో పేర్కొన్నారు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి న్యాయం అందించేందుకు విధులను నిర్వర్తిస్తున్న వారిపై దూషణలకు దిగారని ఫిర్యాదు చేశారు. న్యాయ వ్యవస్థకున్న విలువలను దిగజార్చేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ లో పలు అంశాలను ప్రస్తావించారు.
కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి?
కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ -1971 ప్రకారం కోర్టు ధిక్కరణ రెండు రకాలుగా వ్యవహరించవచ్చు. సివిల్ కంటెంప్ట్ మొదటిది కాగా, క్రిమినల్ కంటెంప్ట్ రెండో రకం కోర్టు ధిక్కరణగా పరిగణించవచ్చు. కోర్టులు ఇచ్చే ఏదైనా తీర్పులు, లేదా ఆదేశాలు, కోర్టు ప్రక్రియ విషయాలను ఉద్దేశపూర్వకంగా అనుసరించకపోవడాన్ని సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అని చెప్పవచ్చు. కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం కావాలనే పాటించకపోవడం ఇందులోకి వస్తుంది.
క్రిమినల్ కంటెంప్ట్ అంటే కొన్ని నిబంధనలపై వ్యాఖ్యలు చేయడం లేదా ప్రచురించడం.. సంజ్ఞల రూపంలో ఉల్లంఘించినట్లయితే దీని కిందకి వస్తుంది. ఇది మూడు రకాలుగా ఉంటుంది. కోర్టు ప్రక్రయల్లో జోక్యం చేసుకోవడానికి యత్నించడం లేక పక్షపాతం చూపించడం, కోర్టు గౌరవాన్ని దిగజార్చే పని చేయడం లేక దూషణలకు దిగడం, న్యాయ పరిపాలన ప్రక్రియలకు ఏదో విధంగా అడ్డుపడటం లాంటివి క్రిమినల్ కంటెంప్ట్ కోవలోకి వస్తాయి.