ముందుగా ఉపాధ్యాయులకే ట్యాబ్‌లు- ఆ తరువాతే విద్యార్థులకు: సీఎం జగన్
నాడు– నేడు పనుల కోసం ఇప్పటి వరకూ రూ.1120 కోట్లు విడుదల చేసినట్లు సీఎం ప్రకటించారు. 2023–24లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుకను అందించేలా కచ్చితమైన ప్రణాళిక ఉండాలని సీఎం స్పష్టం చేశారు.
ఎపీలో 8వ తరగతి విద్యార్దులకు ట్యాబ్‌లను పంపిణి చేసే పనులను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ముందుగా ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను పంపిణి చేసి వారికి అవగాహన కల్పించిన తరువాత విద్యార్థులకు పంపిణి చేయాలన్నారు. పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
నాడు– నేడు పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ.1120 కోట్లు విడుదల చేసినట్లు సీఎం ప్రకటించారు. 2023–24 విద్యా సంవత్సరంలో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుకను అందించేలా కచ్చితమైన ప్రణాళిక ఉండాలని సీఎం స్పష్టం చేశారు. స్కూళ్ల నిర్వహణ అంశాలపై క్రమం తప్పకుండా సచివాలయ ఉద్యోగుల నుంచి నివేదికలు తెప్పించుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ నివేదికలను అనుసరించి ఎలాంటి అలసత్వం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే స్కీంకు సంబంధించి ట్యాబ్‌లు రావడం మొదలైనట్టు అధికారులు తెలిపారు. లక్షన్నరకు పైగా ట్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి త్వరలోనే వస్తున్నాయని సీఎంకు వివరించారు.
ట్యాబ్‌లు వచ్చాక దాంట్లోకి కంటెంట్‌ను లోడ్ చేసే పనులు కూడా వెంటనే మొదలు పెట్టాలని, ఎనిమిదో తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి మొత్తంగా 5,18,740 ట్యాబ్‌లు ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. ముందుగా టీచర్లకు పంపిణీ చేసి, అందులో కంటెంట్‌పై వారికి అవగాహన కల్పిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. బైజూస్ ఇ–కంటెంటును నాల్గో తరగతి నుంచి 10వ తరగతి వరకూ అందిస్తామన్నారు అధికారులు. ట్యాబ్‌లు పొందిన వారు కాకుండా ఈ తరగతులకు చెందిన మిగిలిన విద్యార్థులకు తమ సొంత ఫోన్లలో కంటెంట్ డౌన్లోడ్ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పాఠ్యపుస్తకాల్లో కూడా ఈ కంటెంట్ పొందుపరచాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
డిజిటల్ పద్ధతుల్లోనే కాకుండా హార్డ్ కాపీల రూపంలో కూడా కంటెంట్ అందుబాటులో ఉంటుందన్న సీఎం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్లో బయట వేల రూపాయల ఖర్చయ్యే కంటెంట్‌ను ఉచితంగా వారి వారి సెల్‌ఫోన్స్‌లలో డౌన్లోడ్ చేస్తున్నామన్న అధికారులు, దురదృష్టవశాత్తూ దీన్ని కూడా వక్రీకరించి కథనాలు రాస్తున్నారన్నారు. విద్యా సంబంధిత కార్యక్రమాలు, మంచి చేసే నిర్ణయాలను కూడా రాజకీయాల్లోకి లాగడం అత్యంత దురదృష్టకరమన్నారు సీఎం. స్కూలు పిల్లలను కూడా రాజకీయాలను నుంచి మినహాయించడంలేదని, వారిని కూడా అందులోకి లాగుతున్నారన్నారు.
నాడు – నేడు రెండో పనుల పురోగతి
స్కూళ్లలో నాడు – నేడు కింద కల్పించిన సౌకర్యాలు, వాటి నిర్వహణపై ఆడిట్ చేయించామన్న అధికారులు, ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకునే విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నందున ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నని సీఎం తెలిపారు. జనవరి– ఫిబ్రవరి నాటికి ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు పూర్తి కావాలన్నారు.
మరింత పకడ్బందీగా విద్యాకానుక అందించడానికి చర్యలు తీసుకుంటున్న అధికారులు.. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వివరించారు. ఏప్రిల్ నాటికే విద్యా కానుక కిట్లను సిద్ధం చేస్తున్నామని, పిల్లలకు ఇచ్చే యూనిఫారం క్లాత్ సైజును పెంచేందుకు సీఎం అంగీకారం తెలిపారు. స్టిచ్చింగ్ ధరలు కూడా జతకు 40 నుంచి 50రూపాయలకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకూ మీడియం సైజు స్కూలు బ్యాగు, 6 నుంచి 10వ తరగతి వరకూ పెద్ద బ్యాగు ఇస్తున్నామన్న అధికారులు, నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థను థర్డ్ పార్టీగా పెడుతున్నట్టు వెల్లడించారు. షూ సైజులు కూడా ఇప్పుడే తీసుకుని ఆ మేరకు షూలను నిర్ణీత సమయంలోగా తెప్పిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. అంగన్వాడీ పిల్లలు పీపీ–1,2 పూర్తి చేసుకోగానే వారు స్కూళ్లలో తప్పకుండా చేర్పించేలా చర్యలు తీసుకుకోవాలని సీఎం ఆదేశించారు./