Andhra Pradesh: స్వచ్ఛందంగా తప్పుకోండి, లేదంటే కఠిన చర్యలు- మరో కీలక నిర్ణయం దిశగా సీఎం చంద్రబాబు అడుగులు
Chandra Babu Naidu: అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన దివ్యాంగులందరికీ పెన్షన్ అందజేయాలని, అదే సమయంలో అనర్హులను పక్కనపెట్టాలన్నారు.
AP CM Chandra Babu: ఏపీలో దివ్యాంగుల పెన్షన్ల వ్యవహారంపై మరోసారి సీరియస్ గా చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పెన్షన్ల కోసం దొంగ సర్టిఫికెట్లు తీసుకున్నారని, వాటిద్వారా లబ్ధిపొందారనే ఆరోపణలున్నాయి. వారిలో వైసీపీ నేతలు కూడా ఉన్నారని, అధికారుల ఎంక్వయిరీలో తప్పులున్నట్టు తేలినా రాజకీయ ఒత్తిడితో పెన్షన్లు తీసుకున్నారని అంటున్నారు. ఈ ఆరోపణలను మరోసారి సీఎం చంద్రబాబు సమీక్షలో చర్చకు వచ్చాయి. దొంగ సర్టిఫికెట్లతో పెన్షన్లు తీసుకున్న వారంతా స్వచ్ఛందంగా వాటిని వదులుకోవాలని లేకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు సీఎం.
విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దివ్యాంగులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముందన్న కారణంతో అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ రూ. 3వేల నుంచి ఒకేసారి రూ.6 వేలకు పెంచామన్నారు. అదే విధంగా దీర్ఘకాలిక… pic.twitter.com/QLBDf1nsFk
— Telugu Desam Party (@JaiTDP) September 23, 2024
పెన్షన్ల పెంపు..
గతంలో వృద్ధాప్య, వితంతు పెన్షన్లకు, దివ్యాంగుల పెన్షన్లకు మధ్య వ్యత్యాసం ఉండేది. దివ్యాంగుల పట్ల గత ప్రభుత్వాలు ఉదారంగా పెన్షన్లు పెంచి ఇచ్చేవి. 2019 తర్వాత ఈ పెన్షన్ల చెల్లింపులన్నీ ఒకటే అయ్యాయి. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు.. అందరికీ ఒకటే పెన్షన్ ఇచ్చేవారు. వైసీపీ అధికారంలోనుంచి దిగిపోయే నాటికి వీరందరికీ నెలకు రూ.3వేలు పెన్షన్ అందుతోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలోనే పెన్షన్ల విషయంలో క్లారిటీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు నెలకు రూ.4వేలు, దివ్యాంగులకు నెలకు రూ.6వేలు పెన్షన్ పెంచి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాత బకాయిలతో కలిపి ఇచ్చారు. దీంతో ఇప్పుడు వృద్ధులు, వితంతువుల పెన్షన్ రూ.4వేలకు చేరగా, దివ్యాంగులకు నెలనెలా రూ.6వేలు పెన్షన్ లభిస్తోంది.
ప్రస్తుతం ఏపీలో దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నవారు 8లక్షలమంది ఉన్నారు. విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచిస్తోందని అన్నారు సీఎం చంద్రబాబు. దివ్యాంగులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముందని, అందుకే అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పెన్షన్ రూ. 3వేల నుంచి ఒకేసారి రూ.6 వేలకు పెంచామని చెప్పారు. దీర్ఘకాలిక ఆనారోగ్యంతో బాధపడుతున్నవారికి, మంచానికి పరిమితమైన వారికి.. రూ.15వేలు నెలవారీ పెన్షన్ ఇస్తున్నామన్నారు. దేశంలో ఈ స్థాయిలో సామాజిక పెన్షన్ ఇంకెక్కడా ఇవ్వడం లేదన్నారాయన.
Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాల్లో వర్షాలు - IMD ఆరెంజ్ అలర్ట్
అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన దివ్యాంగులందరికీ పెన్షన్ అందజేయాలన్నారు. అదే సమయంలో తప్పుడు సర్టిఫికెట్లతో కొంతమంది దివ్యాంగుల కోటాలో పెన్షన్ పొందుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు. పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని కూడా చెప్పారు. ఈ అంశం తన దృష్టికి కూడా వచ్చిందని చెప్పారు సీఎం చంద్రబాబు. అర్హులకు, బాధితులకు పెన్షన్ ఇవ్వాలనేది తమ విధానం అని, అయితే పథకాలను దుర్వినియోగం చేస్తూ పెన్షన్లు పొందడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. వైద్యుల నుంచి తప్పుడు సర్టిఫికెట్లు తీసుకుని దివ్యాంగుల కోటాలో పెన్షన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని చెప్పారు. తప్పుడు పద్దతిలో పెన్షన్లు తీసుకుంటున్నవారు స్వచ్ఛందంగా వాటిని వదులుకోవాలని సూచించారు. లేకపోతే పెన్షన్ల అంశంపై ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అనర్హులను తొలగిస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Also Read: కర్నూలులో హైకోర్టు బెంచ్ - చంద్రబాబు ఈ సారి చాయిస్ తీసుకోవడం లేదా ?