Ambati Rambabu: తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోతే, జగన్ కి ఏమిటి సంబంధం?: అంబటి రాంబాబు ఫైర్
Andhra Pradesh News | వరద ఉధృతి పెరిగి తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోతే, దానికి మాజీ సీఎం జగన్ ను బాధ్యులు చేయడం ఏంటని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tungabhadra dam gate washed away | గుంటూరు: వరద ఉధృతికి తుంగభద్ర డ్యామ్‌లో ఒక గేట్ కొట్టుకుపోతే, దానికి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ని బాధ్యులను చేస్తూ, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యామ్ నిర్వహణను తుంగభద్ర బోర్డు చూస్తోందన్న ఆయన, అందులో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేంద్ర జల సంఘం (CWC) ప్రాతినిథ్యం కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటప్పుడు తుంగభద్ర డ్యామ్‌లో భారీ వరదకు 19వ గేట్ కొట్టుకుపోతే, దానికి గత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ ఎలా బాధ్యులవుతారని అంబటి రాంబాబు నిలదీశారు.
తుంగభద్ర డ్యామ్‌లో 19వ క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడం వల్ల రిజర్వాయర్ నుంచి దాదాపు 90 వేల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది. దీనివల్ల ఏపీలో వరదముప్పు రావడమే కాకుండా, ఆయకట్టుకు ఈ ఏడాది నీటి సరఫరాకు ఇబ్బంది కలుగుతుందని అంబటి రాంబాబు తెలిపారు. అందువల్ల వీలైనంత త్వరగా మరమ్మతు చేసి, రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేయాలని డిమాండ్ చేశారు.
పులిచింతల గేట్ కొట్టుకపోతే రిపేర్ చేశాం..
గతంలో తమ ప్రభుత్వ హయాంలో పులిచింతల ప్రాజెక్టులో 16వ గేట్ కొట్టుకుపోతే, కేవలం 20 రోజుల్లో దాన్ని రిపేర్ చేశామన్నారు. అయినా ఆనాడు ఎల్లో మీడియాలో బురద రాతలు రాశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. అలాగే, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ కూడా కొట్టుకుపోతే.. దానికీ మేమే కారణం అంటూ దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. నిజానికి చంద్రబాబు నిర్వాకం వల్లనే గుండ్లకమ్మ గేట్ కొట్టుకుపోయిందని, ఆ ప్రాజెక్టుపై రూ.6 కోట్లు ఖర్చు చేసి రంగులు వేసి, విగ్రహం పెట్టారు తప్ప, గేట్లకు కనీస మరమ్మతులు చేయలేదని అంబటి ధ్వజమెత్తారు.
తుంగభద్ర డ్యామ్ నిర్మించి 71 ఏళ్లు పూర్తయ్యాయని, కానీ ఆ ప్రాజెక్టు గ్యారెంటీ పీరియడ్ 45 ఏళ్లు మాత్రమే అని అంబటి రాంబాబు తెలిపారు. ఇవన్నీ విస్మరించి ఏం జరిగినా.. అన్నింటికి వైయస్సార్ లేదా మాజీ సీఎం వైఎస్ జగన్ ని బాధ్యులను చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని అంబటి రాంబాబు ఆక్షేపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్న చంద్రబాబు, ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారని, ఏపీలో విధ్వంసం సృష్టిస్తున్నారని, అన్నింటికీ జగన్ ని నిందిస్తున్నారని ఇదిసరికాదని ఏపీ ప్రభుత్వానికి అంబటి రాంబాబు హితవు పలికారు.
Also Read: AP Liquor Policy: మందుబాబులకు గుడ్ న్యూస్, ఏపీలో భారీగా తగ్గనున్న మద్యం ధరలు, క్వార్టర్ ధర ఎంతంటే!